బాలుడి ట్రీట్​మెంట్​కు 3.75లక్షలు అందజేసిన కాలనీ వాసులు

బాలుడి ట్రీట్​మెంట్​కు 3.75లక్షలు అందజేసిన కాలనీ వాసులు
  • బాలుడి ట్రీట్​మెంట్​కు సాయం 
  • 8 ఏండ్ల చిన్నారికి బ్లడ్​ క్యాన్సర్
  • 3.75లక్షలు అందజేసిన కాలనీ వాసులు

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: బ్లడ్ క్యాన్సర్​తో బాధపడుతున్న 8 ఏండ్ల బాలుడి ట్రీట్ మెంట్ కోసం కాలనీవాసులు 3 లక్షల75వేల రూపాయలు సాయం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన రమేశ్, సునీత భార్యాభర్తలు. రమేశ్​ డీఆర్​డీఏలో సీసీగా పనిచేస్తుండగా, సునీత పాలమూరులో బస్సు కండక్టర్. వీరికి కొడుకు ఈశ్వరప్రసాద్(8), కూతురు లాస్య(5) ఉన్నారు. ఈశ్వరప్రసాద్ ఇటీవల బ్లడ్​క్యాన్సర్​ బారిన పడ్డాడు. తల్లిదండ్రులు గతనెల 27న హైదరాబాద్​లోని బసవతారకం ఇండో అమెరికా క్యాన్సర్ హాస్పిటల్​లో అడ్మిట్ ​చేశారు. ఇప్పటి వరకు బాలుడి చికిత్స కోసం రూ.2.70లక్షలు ఖర్చు చేశారు. మరో రూ.20లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. విషయం తెలుసుకున్న పంచముఖి హనుమాన్ కాలనీవాసులు చందాలు వేసుకుని ఆదివారం రూ.3.75లక్షలను బాలుడి పేరెంట్స్ కు అందజేశారు. తమ బిడ్డ చికిత్స కోసం సాయం చేసిన ప్రతిఒక్కరికీ తాము జీవితాంతం రుణపడి ఉంటామని రమేశ్, సునీత చెప్పారు.