ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్మాలి

మహాముత్తారం, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్మి, మద్దతు ధర పొందాలని పీఏసీఎస్ చైర్మన్ సోమ శాంతకుమార్ రైతులకు సూచించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కోణంపేటలో ధాన్యం కొనుగోలు సెంటర్​ను ఆయన ప్రారంభించారు. వడ్లు అమ్మిన వారం రోజుల్లోనే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. కార్యక్రమంలో  రైతుబంధు మండల అధ్యక్షలు మార్క రాముగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాధారపు స్వామి, డైరెక్టర్లు చిన్న రాజయ్య, సీఈవో శ్రీధర్ తదితరులున్నారు.

తెగిపడ్డ ముక్కు.. సర్జరీ కోసం హైదారాబాద్​కు..

రఘునాథపల్లి, వెలుగు: పొలంలో నీళ్ల గొడవతో ఇద్దరు వ్యక్తులు కలిసి.. ఓ వ్యక్తి ముక్కు కొరికారు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రామన్నగూడెంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వాకిటి నర్సిరెడ్డి, సాయిరెడ్డి శ్రీనివాస్ వరుసకు బావ, బావమరుదులు. ఇద్దరి పొలాలు పక్కపక్కనే ఉంటాయి. వాకిటి నర్సిరెడ్డికి చెందిన పొలం కోతకు రావడంతో నీళ్లు పెట్టడం బంద్ పెట్టాడు. సాయిరెడ్డి శ్రీనివాస్ కు చెందిన వరి.. ఇంకా కోతకు రాకపోవడంతో నీళ్లు పెడుతున్నాడు. ఈక్రమంలో నీళ్లు పెట్టడం వల్ల తన పంట కోతకు ఇబ్బందిగా మారిందని నర్సిరెడ్డి పెద్దమనుషుల వద్దకు వెళ్లాడు. దీంతో పెద్దమనుషులు తడిసిన భాగమైన కోత ఖర్చులు సాయిరెడ్డి శ్రీనివాస్ భరించాలని తీర్మానం చేశారు. ఈక్రమంలో ఇరువురి కొడుకులు గొడవ పడ్డారు. నర్సిరెడ్డి కొడుకులు కృష్ణ, నరేందర్ కలిసి సాయిరెడ్డి శ్రీనివాస్ కొడుకైన సుధాకర్ ముక్కును కొరికారు. దీంతో సుధాకర్ ముక్కు కొంత భాగం తెగిపడింది. వెంటనే జనగామ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి నుంచి హైదరాబాద్​కు తరలించారు.

పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

పర్వతగిరి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పార్టీ లీడర్లు ప్రజల్లోకి తీసుకెళ్లాలని జడ్పీటీసీ బానోతు సింగులాల్ పిలుపునిచ్చారు. సోమవారం వరంగల్ జిల్లా పర్వతగిరిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో పార్టీ లీడర్లతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి తప్పక  గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా వివిధ కమిటీలను ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమలపంతులు, వైస్ ఎంపీపీ రాజేశ్వర్ రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రంగు కుమార్ గౌడ్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ సర్వర్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు చిన్నపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పార్టీ మారకుంటే సస్పెండ్ చేస్తరా?

ఎమ్మెల్యే చల్లాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ర్యాలీ

ఆత్మకూరు, వెలుగు: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాంగ్రెస్ సర్పంచ్​లపై దౌర్జన్యం చేస్తున్నారని, టీఆర్ఎస్ లో చేరాలని ఒత్తిడి తెస్తున్నారని కాంగ్రెస్ లీడర్లు మండిపడ్డారు. సోమవారం ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలకేంద్రంలో నల్లబ్యాడ్జీలు ధరించి, ర్యాలీ తీశారు. ఆత్మకూరు సర్పంచ్, కాంగ్రెస్ నేత రాజును సస్పెండ్ చేయడం పట్ల బంద్ పాటించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచిన వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ, పార్టీ మారాలని బలవంతం చేయడం సిగ్గుచేటన్నారు. గతంలో ఉప సర్పంచ్​ను సైతం ఇలాగే బెదిరించి పార్టీలో చేర్చుకున్నాడని, ఇప్పుడు సర్పంచ్ మీద పగపడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఇప్పటికి సర్పంచ్​ ని రెండు సార్లు సస్పెండ్ చేయించాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కమలాపురం రమేశ్ తదితరులున్నారు.

అర్హులందరికీ పోడు పట్టాలియ్యాలని ఫారెస్ట్ ఆఫీస్ ముట్టడి

వెంకటాపురం, వెలుగు: అర్హులైన పోడు రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకురి సతీశ్​కుమార్, భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ త్రినాథరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం వెంకటాపురంలో పోడు రైతులతో కలిసి, బీజేపీ నాయకులు భారీ ర్యాలీ తీశారు. అనంతరం ఫారెస్ట్ ఆఫీసును ముట్టించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పోడు రైతులను వాడుకుంటోందని ఆరోపించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సర్వేల పేరుతో మాయ చేస్తోందన్నారు. శాటిలైట్​చిత్రాలను చూపిస్తూ.. రైతుల పేర్లు గల్లంతు చేస్తున్నారని ఆరోపించారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు అట్లూరి రఘురాం, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు ఉప్పల కృష్ణమూర్తి, మండల మహిళా మోర్చా అధ్యక్షులు దుర్గ తదితరులున్నారు.

మండల సభకు ఆఫీసర్ల డుమ్మా

ప్రజాప్రతినిధుల అసహనం 

వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా వెంకటాపురం మండలకేంద్రంలో సోమవారం జరగాల్సిన సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. ఈ మీటింగ్​కు ఆఫీసర్లు హాజరుకాకపోవడంతో ప్రజానిధులు వాకౌట్ చేశారు. ఆఫీసర్ల తీరుపై మండిపడ్డారు. ఆఫీసర్లే డుమ్మా కొడితే అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. దీనిపై ఎంపీడీవో అడ్డూరి బాబును వివరణ కోరగా.. మొత్తం 24 ప్రభుత్వ శాఖల్లోని 8 శాఖల అధికారులు వివిధ కారణాలతో సమావేశానికి హాజరు కాలేదన్నారు. వారికి నోటీసు పంపి, త్వరలోనే మండల సభ నిర్వహిస్తామన్నారు.

టీఆర్ఎస్ పై కేంద్రం కక్ష సాధింపు

చీఫ్ విప్ వినయ్ భాస్కర్

కాజీపేట, వెలుగు: టీఆర్ఎస్ నాయకులపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. సోమవారం కాజీపేట మండలం మడికొండలో వరంగల్ వెస్ట్ సెగ్మెంట్ లీడర్లతో మీటింగ్ నిర్వహించారు. నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు క్యారమ్స్, క్రికెట్ వంటి ఆటలు నిర్వహించారు. అనంతరం భద్రకాళి, వడ్డేపల్లి చెరువుల్లో చేప పిల్లలు వదిలారు.

రూల్స్​ మేరకే స్వామీజీ రూం సీజ్

కాజీపేట, వెలుగు: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో రూల్స్ మేరకే స్వామీజీ రూంను సీజ్ చేసినట్లు ఎండోమెంట్ ఏసీ సునీత వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్యానంద స్వామిజీ అనే వ్యక్తి రెండు నెలల కింద టెంపుల్​కి రాగా.. అతని కోసం అన్నదాన సత్రంలో రూం కేటాయించారు. వారం రోజులు ఉంటానని వచ్చి, రెండు నెలలుగా ఖాళీ చేయడం లేదుv. అంతేకాక ఎండోమెంట్​రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో అతని రూంను ఆఫీసర్లు సీజ్ చేశారు. కాగా, ఎండోమెంట్ తీరుపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్​ రెడ్డి, హిందూ సంఘాల నాయకులు మండిపడ్డారు. ఆలయం వద్దకు చేరుకుని ఆఫీసర్లతో వాదనకు దిగారు. స్వామీజికి క్షమాపణ చెప్పి, ఆయనకు గది కేటాయించాలని డిమాండ్ చేశారు.

గంగపుత్రులు ఐక్యంగా ఉద్యమించాలి

హనుమకొండ సిటీ, వెలుగు: గంగపుత్రులు హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ గంగపుత్ర సంక్షేమ ట్రస్ట్​ ట్రస్ట్​ చైర్మన్​ డా.సనత్ పిలుపునిచ్చారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా హనుమకొండ పెద్దమ్మగడ్డలోని గంగా గార్డెన్స్​లో ఆయన మాట్లాడారు. చేపలు పట్టే వృత్తి పైనే ఆధారపడి బతుకుతున్న ఎంతోమందికి సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు.  గంగపుత్రులు రాజకీయంగానూ ఎదగాలని ఆకాంక్షించారు. సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పాక ఓం ప్రకాశ్​, ప్రధాన కార్యదర్శి పాక వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి కొమురెల్లి ఉన్నారు.

దొరల పాలనను అంతం చేయాలి

నెల్లికుదురు, వెలుగు: బహుజన కులాలన్నీ ఏకమై దొరల పాలనను అంతం చేయాలని దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్ పిలుపునిచ్చారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి, ఎర్రబెల్లిగూడెం, కాచికల్, నెల్లికుదురు గ్రామాల్లో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యానికి, మాంసానికి, డబ్బుకు ఆయుధంలాంటి ఓటును అమ్ముకోవద్దన్నారు. తెలంగాణలో రెడ్డి, వెలమల రాజ్యాన్ని దింపి.. బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాన్ని సాధించడమే తమ లక్ష్యమన్నారు. పేదల పాలనను ఏర్పాటు చేసుకుని, మన బతుకులు మనం బాగు చేసుకుందామని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్, లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కృష్ణ నాయక్ తదితరులున్నారు.