
- చంద్రబాబును ఆహ్వానించిన షర్మిల
- తమ మధ్య రాజకీయాల గురించి చర్చ జరగలేదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తన కుమారుడు రాజారెడ్డి పెళ్లికి రావాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కాంగ్రెస్ నేత షర్మిల ఆహ్వానించారు. శనివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు నివాసానికి వెళ్లి, పెళ్లి కార్డును అందజేశారు. అనంతరం మీడియాతో షర్మిల మాట్లాడుతూ.. తన కొడుకు పెళ్లికి ఇన్వైట్ చేయడం కోసమే చంద్రబాబును కలిశానని, ఈ భేటీలో ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని తెలిపారు. పెళ్లికి అటెండ్ అయి తన కుమారుడిని ఆశ్వీరదించాలని కోరానన్నారు. వైఎస్సార్, చంద్రబాబు మధ్య మంచి స్నేహం ఉందని, వారి ఫ్రెండ్‌షిప్ గురించే చాలాసేపు చర్చ జరిగిందన్నారు.
వైఎస్సార్ గురించి చంద్రబాబు చాలా గొప్పగా చెప్పారని తెలిపారు. చంద్రబాబును కలవడం రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, గత నెలలో క్రిస్మస్ కేక్ పంపితే తప్పుబట్టారని, క్రిస్మస్ కేక్‌ను కేటీఆర్, హరీశ్‌రావు, కవితలకు కూడా పంపానని గుర్తుచేశారు. రాజకీయాలే జీవితం కాదని, ప్రజల కోసం చేస్తున్న సర్వీస్.. తమ ప్రొఫెషన్ అని షర్మిల అన్నారు. కేవలం రాజకీయంగా ప్రత్యర్థులం మాత్రమేనని, పాలిటిక్స్‌లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమేనన్నారు. చంద్రబాబు ఓ పార్టీకి ప్రెసిడెంట్ అని, తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనన్నారు. తమకు రాజకీయంగా ఎలాంటి లావాదేవీలు లేవన్నారు.
కాంగ్రెస్‌లో ఏ బాధ్యతలు ఇస్తున్నారన్న మీడియా ప్రశ్నకు.. ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలని, ఆయన ప్రధాని అయితేనే దేశం బాగుపడుతుందని తెలిపారు. ఏపీ కాంగ్రెస్‌లోకి వలసలపై షర్మిల స్పందిస్తూ.. తనకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత చేరికలపై క్లారిటీ వస్తుందని చెప్పారు.