- కమర్షియల్ సిలిండర్‌పై రూ.993 పెంపు
- ఇంత భారీగా ధర పెంచడం చరిత్రలోనే తొలిసారి
- 5 కేజీల సిలిండర్‌పై రూ.261 బాదుడు
- ఈ ధరలు మే 1 నుంచే అమలు
- డొమెస్టిక్ సిలిండర్ ధరలు యథాతథం..
- హైదరాబాద్‌లో 19 కేజీల సిలిండర్ ధర రూ.3,315.. 5 కేజీల సిలిండర్ రూ.914
- అంతర్జాతీయ సంక్షోభమే
- కారణమన్న ఆయిల్ కంపెనీలు
- చిరు వ్యాపారులు, హోటళ్లు, హాస్టళ్లు, కేఫ్‌లు, టిఫిన్ సెంటర్లపై ఎఫెక్ట్
న్యూఢిల్లీ:ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు కేంద్ర సర్కారు షాక్ ఇచ్చింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా రూ. 993 పెంచుతున్నట్టు చమురు సంస్థలు శుక్రవారం ప్రకటించాయి. దీంతోపాటు 5 కేజీల మినీ సిలిండర్ ధర కూడా రూ. 261 పెరిగింది.
ఈ పెరిగిన ధరలు శుక్రవారం (మే 1) నుంచే అమల్లోకి వచ్చాయి. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని కేంద్రం వెల్లడించింది. కాగా, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే నెలలో రూ. 993 పెరగడం ఇదే తొలిసారి. ఈ ప్రభావం రెస్టారెంట్లు, హోటళ్ల వ్యాపారాన్ని దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. హోటళ్లు ఆ భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశం ఉంది.
- మెట్రో నగరాల్లో కొత్త ధరలు
ఈ భారీ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 3,071కి చేరుకోగా, ముంబైలో రూ. 3,024 వద్ద ఉంది. కోల్‌కతాలో రూ. 3,202, చెన్నైలో రూ. 3,237 గా నమోదైంది. గత మూడు నెలల్లోనే వాణిజ్య గ్యాస్ ధర సుమారు రూ. 1,300 మేర పెరగడం గమనార్హం. ఇరాన్-–ఇజ్రాయెల్ ఘర్షణల వల్ల గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినడం, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 126 డాలర్లు (సుమారు రూ.11,955) దాటడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని ఆయిల్ కంపెనీలు పేర్కొంటున్నాయి.
- 4 నెలల్లో సిలిండర్ ధర డబుల్
ఇరాన్, ఇజ్రాయెల్/అమెరికా యుద్ధం ఫిబ్రవరిలో ప్రారంభంకాగా.. అప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ ధరను కేంద్రం 3 సార్లు పెంచింది. కేవలం నాలుగు నెలల్లోనే రేట్ డబుల్ అయింది. మార్చిలో రూ.144, ఏప్రిల్ ఒకటిన రూ.195, ఇప్పుడు అమాంతం రూ.993 పెంచేసింది. దీంతో ఒక్క కమర్షియల్ సిలిండర్ ధర రూ.3 వేలు దాటింది. హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో రూ. 1,961 ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర.. ఇప్పుడు ఏకంగా రూ. రూ.3,315కు చేరింది. ఇక, ఐదు కిలోల సిలిండర్ ధర రూ.914.50కి పెరిగింది.
వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, గృహ అవసరాలకు వాడే 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 913 వద్దే కొనసాగుతోంది. అలాగే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను కూడా యథాతథంగా ఉంచుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) నిర్ణయం తీసుకుంది. దాదాపు 80 శాతం చమురు ఉత్పత్తుల ధరల్లో మార్పు చేయలేదని, కేవలం 16 శాతం మేర ఉన్న పారిశ్రామిక ఇంధనాల ధరలను మాత్రమే సవరించామని కంపెనీ స్పష్టం చేసింది. కాగా, ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గించడం ద్వారా దేశీయంగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటున్నది.
- హోటల్ తిండి ప్రియం!
కమర్షియల్ సిలిండర్ ధర ఒక్కసారిగా రూ. 993 పెరగడం పట్ల హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతుండగా, ఇప్పుడు గ్యాస్ భారం కూడా తోడవడంతో టిఫిన్లు, భోజనాల ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని వారు చెబుతున్నారు. ఏప్రిల్‌లో పెరిగిన రూ. 200 ధరనే భరించలేకపోతున్నామని, ఇప్పుడు అదనంగా రూ. వెయ్యి పెంచితే ఆ భారాన్ని కచ్చితంగా కస్టమర్లపైనే వేయాల్సి ఉంటుందని హోటల్ అసోసియేషన్లు చెబుతున్నాయి.
- ఎఫెక్ట్ ఇదే.
చిన్న, మధ్యతరహా హోటళ్లలో వంటకాల ధరలు కనీసం 20 % పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఇప్పటివరకు రూ. 50 ఉన్న ప్లేట్ ఇడ్లీ లేదా దోశ ధర రూ. 60 నుంచి రూ.70కి చేరవచ్చు.
టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, బాటిల్డ్ వాటర్ ధరలు 25 శాతం వరకు పెరిగే చాన్స్ ఉంది.
వంట గ్యాస్ ధరలతో పాటు సరఫరాలో కూడా ఇబ్బందులు ఉండటంతో హోటల్ యజమానులు కొత్త పద్ధతులు పాటిస్తున్నారు. ఎక్కువ సేపు ఉడికించాల్సిన వంటకాలను (ఉదాహరణకు కొన్ని రకాల బిర్యానీలు, గ్రేవీ కూరలు) మెనూ నుంచి తొలగిస్తున్నారు.
విద్యాసంస్థలు, ఆఫీసు క్యాంటీన్లు, పేయింగ్ గెస్ట్ (పీజీ) హాస్టళ్లలో మెస్ చార్జీలు పెరగనున్నాయి.
రోడ్డు పక్కన బండ్ల మీద అమ్మే మిర్చి బజ్జీలు, పునుగులు వంటి స్నాక్స్ ధరలు కూడా రూ.5 నుంచి రూ.10 వరకు పెరిగే అవకాశం ఉంది.
మసాలాల తయారీ, ఆహార శుద్ధి పరిశ్రమల్లో కమర్షియల్ గ్యాస్ వాడటం వల్ల ప్యాక్ చేసిన ఆహార పదార్థాల ధరలు కూడా ప్రభావితం కానున్నాయి.
బయట దొరికే ఆహార పదార్థాల ధరలు పెరగడం వల్ల మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ తలకిందులు కానున్నది.
ముఖ్యంగా బ్యాచిలర్లు, ఉద్యోగులు, రోజువారీ హోటల్ తిండిపై ఆధారపడే వారిపై ఈ ‘గ్యాస్ మంట’ తీవ్ర ప్రభావం చూపనున్నది.
