V6 News

యాదగిరిగుట్టపై ఒక్క సెల్ ఫోన్ కౌంటర్ ఆదాయమే రూ.2.22 కోట్లు .. టెండర్లు లేకుండానే నడుపుతూ కోట్ల సంపాదన.. ప్రభుత్వానికి భారీ గండి

యాదగిరిగుట్టపై ఒక్క సెల్ ఫోన్ కౌంటర్ ఆదాయమే రూ.2.22 కోట్లు .. టెండర్లు లేకుండానే నడుపుతూ కోట్ల సంపాదన.. ప్రభుత్వానికి భారీ గండి
  • ఏళ్లుగా కొందరి చేతుల్లోనే దుకాణాలు 
  • ఒక్క సెల్ ఫోన్ కౌంటర్ ఆదాయం రూ.2.22 కోట్లు 
  • 10 దుకాణాలు కలిపి ఇచ్చేది కేవలం రూ.1.68 కోట్లే. 
  • ఓపెన్ టెండర్లు వేస్తే రూ.20 కోట్ల నుంచి 25 కోట్ల లబ్ధి చేకూరుతుందనే టాక్​ 

హైదరాబాద్, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొందరు దుకాణాలదారుల గుత్తాధిపత్యం నడుస్తోంది. ఓపెన్​టెండర్లు వేయకుండా నామమాత్ర అద్దెలతో లబ్ధి పొందుతుండగా, దేవాదాయశాఖ ఆదాయానికి గండిపడుతున్నది. వర్తక సంఘం ఆధిపత్యంతో ఆలయానికి నష్టం వాటిల్లుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొండపై ఉన్న సెల్ ఫోన్ కౌంటర్ టెండర్ ద్వారా దేవస్థానానికి ఏడాదికి రూ.2 కోట్ల 22 లక్షల ఆదాయం సమకూరుతోంది.

కానీ, వర్తక సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న 10 కీలక దుకాణాలకు సంబంధించి దేవస్థానానికి చెల్లిస్తున్నది 1కోటీ 68 లక్షల రూపాయలు మాత్రమే. దీంతో ఒక చిన్న కౌంటర్ నుంచి వచ్చే ఆదాయం కంటే 10 పెద్ద దుకాణాలు ఇచ్చే ఆదాయం తక్కువగా ఉండడం వెనుక ఉన్న మర్మమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.

మే 31న ముగియనున్న టెండర్ల గడువు 

కొండపై ఉన్న 112 తాత్కాలిక దుకాణాల్లో ప్రస్తుతం 10 దుకాణాలు వర్తక సంఘం పేరిటే కొనసాగుతున్నాయి. వీటికి మే 31 నాటికి గడువు ముగియనుంది. కాగా, ఈ దుకాణాలు ఎప్పుడూ ఒకే వర్గం లేదా కొందరి చేతుల్లోనే ఉండడం వల్ల కొత్తవారికి, స్థానిక నిరుద్యోగులకు అవకాశాలు దక్కడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏటా కొత్త టెండర్లు పిలిచి అందరికీ అవకాశం కల్పిస్తే దేవస్థానానికి రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నోటిఫికేషన్ లో జాప్యం ఎందుకు?

నిబంధనల ప్రకారం ఏదైనా టెండర్ గడువు ముగియడానికి మూడు నెలల ముందే నోటిఫికేషన్ జారీ చేయాలి. కానీ వర్తక సంఘం దుకాణాల గడువు సమీపిస్తున్నా అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ తిష్ట వేసిన నాయకులు, వ్యాపారుల ఒత్తిడి వల్లే నోటిఫికేషన్ ఆలస్యం అవుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, దేవాదాయ శాఖ అధికారులు మాత్రం టెండర్ నోటిఫికేషన్ గడువు ముగుస్తుందని ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశామని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం ముందుకెళ్తామని చెప్తున్నారు. దేవస్థానానికి అదనపు ఆదాయంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి దక్కాలంటే వర్తక సంఘం గుత్తాధిపత్యానికి చెక్​పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.