
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో ఐదో రోజు బుధవారం 55 మంది అభ్యర్థులు 61 నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. మొత్తం ఇప్పటి వరకు131 మంది నుంచి146 నామినేషన్లు వచ్చాయన్నారు. అంబర్పేట, బహదూర్పురా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, గోషామహల్, జూబ్లీహిల్స్, కార్వాన్, మలక్ పేట, ఖైరతాబాద్, ముషీరాబాద్, నాంపల్లి, సనత్నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, యాకత్ పురా సెగ్మెంట్లకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సనత్ నగర్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి సికింద్రాబాద్లోని బల్దియా సర్కిల్ ఆఫీసులో నామినేషన్ వేశారు.
రంగారెడ్డి జిల్లాలో..
శేరిలింగంపల్లి సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్థానిక జోనల్ ఆఫీసులో నామినేషన్ వేశారు. అరికెపూడి గాంధీ భార్య శ్యామలా దేవి ఇండిపెండెంట్ అభ్యర్థిగా శేరిలింగంపల్లి నుంచి నామినేషన్ వేశారు. వారి వెంట ఎంపీ రంజిత్ రెడ్డి, కార్పొరేటర్లు ఉన్నారు. షాద్నగర్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థిగా అందె బాబయ్య నామినేషన్ వేశారు. ఆయన వెంట కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ ఉన్నారు. షాద్ నగర్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా వీర్లపల్లి శంకర్ నామినేషన్ వేశారు. చేవెళ్ల కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా సున్నపు వసంతం నామినేషన్ వేశారు.