
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు కోసం మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. న్యాయ నిపుణులతో చర్చించి 2025, ఆగస్ట్ 28వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని మంత్రుల కమిటీని ఆదేశించింది ప్రభుత్వం.
మంత్రుల కమిటీ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. 2025, ఆగస్ట్ 29న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించి మంత్రుల కమిటీ సమర్పించిన నివేదికపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు శనివారం (ఆగస్ట్ 23) గాంధీభవన్ లో జరిగిన టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
శనివారం (ఆగస్ట్ 23) గాంధీభవన్ లో టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) భేటీ అయ్యింది. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధానంగా చర్చించారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశం ముగిసిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలపై ఏ విధంగా ముందుకెళ్లాలో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని, ఓ కమిటీని ఏర్పాటు చేసి ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
ఆగస్ట్ 28లోగా కమిటీ నివేదిక ఇస్తుందని, 29వ తేదీన కేబినెట్ భేటీ నిర్వహించి కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సెప్టెంబర్ లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. దేశంలో ఓట్ చోరీ జరుగుతోందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రకు ఆగస్ట్ 26వ తేదీన సీఎం సహా మంత్రులందరం బీహార్ వెళ్తామని చెప్పారు.