- కో ఆప్షన్, నామినేటెడ్ పోస్టులు ఇస్తామని హామీలు
- పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే వేటు తప్పదని వార్నింగ్
- మంచిర్యాల కార్పొరేషన్లో అన్ని పార్టీల్లో పోటాపోటీ
మంచిర్యాల, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగియడంతో బుజ్జగింపులు, బెదిరింపుల పర్వం మొదలైంది. వివిధ పార్టీల నుంచి టికెట్లు ఖరారుచేయకపోవడంతో ఆశావహుల జాబితాలో ఉన్న లీడర్లు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఒక్కో వార్డు, డివిజన్ నుంచి ముగ్గురు, నలుగురు పోటీలో నిలిచారు. మంచిర్యాల కార్పొరేషన్లో అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్లోనూ తీవ్రమైన పోటీ నెలకొంది.
ఈనెల 3 వరకు నామినేషన్ల విత్ డ్రా కోసం గడువుంది. ఈలోగా నామినేషన్ ఉపసంహరించుకొని పోటీ నుంచి తప్పుకోవాలని అభ్యర్థులను నాయకులు కోరుతున్నారు. రానున్న రోజుల్లో మంచి పదవులు ఇస్తామని బుజ్జగిస్తున్నారు. అందుకు వినకుంటే వారి దందాల సంగతి చూస్తా మని, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.
పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే వేటే..
మున్సిపల్ ఎన్నికలను మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని బరిలోకి దిగాయి. ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు పోటీలో ఉంటే పెద్ద సంఖ్యలో ఓట్లు చీలిపోయి అసలుకే ఎసరు వస్తుందని, ప్రత్యర్థి పార్టీలకు మేలు జరిగే చాన్స్ ఉంటుందని భయపడుతున్నారు. టికెట్ల కేటాయింపులో పార్టీలు అనుసరించిన నాన్చుడు ధోరణి వల్లే ఈ పరిస్థితి నెలకొంది.
సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయిస్తామని ప్రకటించిన నాయకులు నామినేషన్ల గడువు ముగిసేంత వరకూ అభ్యర్థుల పేర్లు వెల్లడించలేదు. దీంతో ఒక్కో డివిజన్, వార్డు నుంచి ఆశావహుల జాబితాలో ఉన్న ముగ్గురు, నలుగురు లీడర్లు నామినేషన్లు వేశారు. శనివారం సాయంత్రం నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లోని 60 వార్డులకు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అభ్యర్థులను ప్రకటించారు.
అలాగే బీజేపీ మొదటి విడతలో 10 డివిజన్లకు అభ్యర్థుల లిస్టు రిలీజ్చేసింది. ఆయా డివిజన్ల నుంచి నామినేషన్లు వేసినవారు వెంటనే విత్ డ్రా చేసుకోవాలని నాయకులు సూచిస్తున్నారు. పలువురికి కోఆప్షన్ పదవులు లేదా నామినేటెడ్ పోస్టులు ఇస్తామని ఆశ చూపుతున్నారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించిన వారిపై వేటు తప్పదని వార్నింగ్ ఇస్తున్నట్టు సమాచారం. మిగిలిన నాలుగు మున్సిపాలిటీల్లో ఇంకా అభ్యర్థులను ఖరారు చేయకున్నా ఎవరెవరు విత్ డ్రా చేసుకోవాలో ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.
పోటాపోటీగా నామినేషన్లు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు గాను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి 377 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇతర గుర్తింపు పొందిన పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి 615 నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి 150, బీఆర్ఎస్ నుంచి 159, బీజేపీ నుంచి 177 నామినేషన్లు వచ్చాయి. ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి 58 నామినేషన్లు రాగా, ఇండిపెండెంట్‌గా 44 దాఖలయ్యాయి.
బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులకు కాంగ్రెస్ నుంచి 166, బీఆర్ఎస్ నుంచి 108, బీజేపీ నుంచి 36, ఇండిపెండెంట్‌గా 22 నామినేషన్లు వచ్చాయి. చెన్నూరు మున్సిపాలిటీలో 18 వార్డులకు కాంగ్రెస్ నుంచి 74 బీఆర్ఎస్ నుంచి 49, బీజేపీ నుంచి 37 నామినేషన్లు రాగా ఇండిపెండెంట్‌గా మరో 42 నామినేషన్లు దాఖలయ్యాయి. క్యాతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు కాంగ్రెస్ నుంచి 87, బీఆర్ఎస్ నుంచి 53, బీజేపీ నుంచి 34, ఇండిపెండెంట్‌గా 33 నామినేషన్లు వేశారు.
లక్సెట్టిపేట మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను మూడు ప్రధాన పార్టీల నుంచి 42 చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. ఈ లెక్కన మంచిర్యాల కార్పొరేషన్ లో అత్యధిక సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. బెల్లంపల్లి సహా ఇతర మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ నుంచి ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.
