
లక్ష్మణచాంద, వెలుగు: లక్ష్మణచాంద మండలం పీచరలో మత్స్య సొసైటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ఫిషరీస్ డెవలప్మెంట్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అడ్డుకుంటున్నారని పీచర ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ, యువజన క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి ఫిర్యాదు చేశారు. ఈమేరకు సోమవారం మక్తల్‌లో మంత్రి శ్రీహరిని కలిసి
విన్నవించారు.
పీచరలో గంగపుత్రులు, మరికొన్ని వర్గాలు కలిసి ముదిరాజ్‌లపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్మల్ జిల్లా మత్స్యశాఖ ఏడీని సైతం బెదిరిస్తూ సొసైటీ ఏర్పాటును అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉన్న రెండు గంగపుత్ర కుటుంబాలు సుమారు ఐదు చెరువులను తమ ఆధీనంలోకి తీసుకొని.. వంద కుటుంబాలున్న ముదిరాజ్‌లను కాదని పెత్తనం చలాయిస్తున్నారని పేర్కొన్నారు.
హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ సాయికుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని మంత్రిని కోరారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్, పీచర మత్స్యకారుల సంఘం నాయకులు గుర్రం బొర్రన్న ముదిరాజ్, బొమ్మరేని శ్రీకాంత్, గుర్రం నరేశ్, బొమ్మరేణి నరేందర్, ఉడుత సుభాష్, గుర్రం ముత్యం తదితరులున్నారు.