బాల్క సుమన్ను అరెస్ట్ చేయాలి ..అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు

బాల్క సుమన్ను అరెస్ట్ చేయాలి ..అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు
  • సింగరేణి జూనియర్ ఇన్​స్పెక్టర్ ఫిర్యాదుతో నాంపల్లి పీఎస్​లోనూ కేసు

అబిడ్స్, వెలుగు: చెన్నూరు బీఆర్ఎస్​మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని డీసీసీ ఖైరతాబాద్ అధ్యక్షుడు మోత రోహిత్ అన్నారు. ఆయనను వెంటనే అరెస్ట్​చేయాలని కోరుతూ బుధవారం హైదరాబాద్​లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సింగరేణి కార్యాలయాలు, రైల్వే లైన్లు తగలబెట్టాలని, హింసాత్మక చర్యలకు పాల్పడాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తి బాధ్యతారాహిత్యమైనవని పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేసి, అరెస్ట్​చేయాలని సీఐ పరశురాంను కోరారు.

అలాగే, సింగరేణిలో మిలిటెంట్ యాక్టివిటీ చేయాలంటూ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జూనియర్ ఇన్​స్పెక్టర్ బి.ఆనంద్ బుధవారం నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగరేణి ఆస్తులకు నష్టం చేయాలన్న ఆయన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మందమర్రి డివిజన్ లో ప్రోగ్రాం పెట్టి, జీఎం కార్యాలయాన్ని తగలబెట్టాలని సుమన్ బీఆర్ఎస్​కార్యకర్తలను రెచ్చగొట్టారన్నారు. అలాగే, నాంపల్లిలోని సింగరేణి భవన్ ను తగలబెట్టి, ఆగం చేయాలని ప్రేరేపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జూనియర్​ఇన్​స్పెక్టర్​ఫిర్యాదు మేరకు బాల్క సుమన్​పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.