జూన్ 10లోపు స్కూల్ రిపేర్లు పూర్తి చేయాలి: నల్గొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్

జూన్ 10లోపు స్కూల్ రిపేర్లు పూర్తి చేయాలి: నల్గొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్

నల్గొండ, వెలుగు:  పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోపే ప్రభుత్వ బడులలో చేపట్టిన అన్ని రకాల రిపేర్లను జూన్ 10లోపు పూర్తి చేయాలని నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫర్నిచర్ తదితర మౌలిక వసతులను సిద్ధం చేయాలన్నారు. 

పాఠశాల బస్సుల ఫిట్‌‌‌‌నెస్ పరీక్షలను ముగించి విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.  బడులు తెరిచే నాటికి విద్యార్థులందరికీ యూనిఫాంలు అందజేయాలని, వాటి కుట్టు పనులను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించాలని స్పష్టం చేశారు. ప్రతి పాఠశాలలో లైబ్రరీలను ఏర్పాటు చేసి పఠనాసక్తిని పెంపొందించాలని, జీరో అడ్మిషన్లు ఉన్న బడులలో ప్రత్యేక కార్యాచరణ ద్వారా విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచాలని ఆదేశించారు.

 జూన్ 12లోపు విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందించాలని, నూతన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఏఐ ఆధారిత తరగతులు నిర్వహించాలని సూచించారు. పాఠశాలల్లోనే ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి చర్యలు చేపట్టడంతో పాటు, తెలంగాణ పబ్లిక్ మోడల్ స్కూల్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.