- పైసా లంచం తీసుకున్నా జైలుకే: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణను భూ వివాదాలు లేని రాష్ట్రంగా మార్చేందుకు చేపట్టిన సమగ్ర రీ–సర్వేను ఏడాదిన్నరలో పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్రంలోని 7 జోన్లకు రెవెన్యూ, సర్వే విభాగాల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 14 మంది సీనియర్ అధికారులను ప్రత్యేక పర్యవేక్షకులుగా నియమించినట్లు వెల్లడించారు. దాదాపు 125 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో మొదలైన ఈ సర్వే పురోగతిపై మంత్రి శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ఒక్క ఇంచు జాగా విషయంలోనూ రైతుల మధ్య తగాదాలు లేకుండా సరిహద్దులను శాశ్వతంగా తేల్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. సర్వేలో నాణ్యత, వేగం, పారదర్శకతతో పాటు నిరంతర పర్యవేక్షణే అత్యంత కీలకమని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్‌లో రియల్ టైమ్ డిజిటిల్ డాష్ బోర్డు
రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత మ్యాపులు, నక్షాలేని 365 గ్రామాలు, జిల్లాకు 70 చొప్పున 2,768 గ్రామాల్లో రీ-సర్వే ముమ్మరంగా సాగుతోందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 245 గ్రామాల్లో సర్వే పూర్తయిందని.. మొదటి దశ లక్ష్యాన్ని ఈ ఏడాది నవంబర్ నెలాఖరు నాటికి చేరకుంటామని చెప్పారు. ప్రతి మండలానికి రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని, సర్వే జరిగే ప్రాంతాల్లో తహసీల్దార్లు ప్రతిరోజూ పర్యటించి పరిశీలించాలని ఆదేశించారు. రోజువారీ సర్వే పురోగతి, రోవర్ల లొకేషన్లను నిరంతరం ట్రాక్ చేసేందుకు హైదరాబాద్‌లో రియల్‌టైమ్ డిజిటల్ డాష్‌బోర్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ భూముల సర్వేలో ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ఇదే సమయంలో సర్వే పేరుతో రైతుల నుంచి పైసా వసూలు చేసినా ఉపేక్షించేది లేదని, ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆ 45 ఎకరాల లెక్క తేలుస్తాం
గత ప్రభుత్వ హయాంలో ఎర్రవల్లి పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు చేతులు మారినట్లు గుర్తించామని, వాటిని స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకే తిరిగి పంచుతామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు భూ కేటాయింపుల్లో న్యాయం చేస్తామన్నారు. భూ దందాలకు పాల్పడిన వారు ఎంతటి పెద్దలైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, పేదల హక్కులను కాపాడే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
