బీసీల అభివృద్ధిపై అధ్యయనం..రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లపై ఉన్నతస్థాయి కమిటీ వేయాలి : బీసీ కమిషన్

బీసీల అభివృద్ధిపై అధ్యయనం..రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లపై ఉన్నతస్థాయి కమిటీ వేయాలి  : బీసీ కమిషన్
  • ప్రభుత్వానికి బీసీ కమిషన్ వినతి

హైదరాబాద్, వెలుగు: వెనుకబడిన తరగతుల స్థితిగతులతో పాటు కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని బీసీ కమిషన్ నిర్ణయించింది. వీరికి సుస్థిర ఆదాయ మార్గాలు కల్పించడం, కులవృత్తుల ఆధునీకరణపై అధ్యయనం చేస్తామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు.

సోమవారం ఆయన అధ్యక్షతన జరిగిన కమిషన్ సమావేశంలో సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, సభ్య కార్యదర్శి బాల మాయాదేవి పాల్గొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ల నిబంధనల వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ పలువురు కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేసినట్లు సమావేశంలో వెల్లడైంది. ఈ నిబంధనలను సమగ్రంగా పరిశీలించేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కమిషన్ కోరింది. 

ఈబీసీ సీట్ల పెంపుపై అభ్యంతరం

మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకంలో 350 మంది విద్యార్థులకు ప్రభుత్వం సహాయం అందించనుండగా, అందులో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈబీసీ) వారికి 100 సీట్లు కేటాయించడంపై కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు మొత్తం సీట్లలో ఈబీసీలకు 5 శాతం మాత్రమే కేటాయిస్తుండగా, ఇప్పుడు దానిని 28 శాతానికి ఎందుకు పెంచారో వివరణ ఇవ్వాలని బీసీ సంక్షేమ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించింది.