కాళేశ్వరంపై కాగ్ ఫోకస్

కాళేశ్వరంపై కాగ్ ఫోకస్
  • ప్రాజెక్టు ఖర్చులపై వివరాల సేకరణ 

హైదరాబాద్‌‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై కంప్ట్రోలర్‌‌ అండ్‌‌ ఆడిటర్‌‌ జనరల్‌‌(కాగ్) దృష్టి సారించింది. ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు చేసిన పనులు, అందుకు చేసిన ఖర్చు, ప్యాకేజీల వారీగా నిర్మాణానికి ఎంత వ్యయంతో అనుమతులిచ్చారు, తర్వాత వాటిని ఎంతకు పెంచారనే వివరాలపై ఆరా తీసింది. గురువారం కాగ్‌‌ డిప్యూటీ అకౌంటెంట్‌‌ జనరల్‌‌ (ఢిల్లీ) రాజ్‌‌వీర్‌‌సింగ్‌‌, డిప్యూటీ అకౌంటెంట్‌‌ జనరల్‌‌(హైదరాబాద్‌‌) రోహిత్‌‌ గుట్టేలు హైదరాబాద్‌‌ ఏజీ ఆఫీస్‌‌ అకౌంట్స్‌‌ అధికారులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌‌ను పరిశీలించారు. వాటి నిర్మాణ వ్యయం, మోటార్లు, పంపులు, ఇతర హైడ్రో ఎలక్ట్రికల్‌‌ పరికరాల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను సేకరించారు. కాగా, ప్రాజెక్టు ఆడిట్‌‌ నివేదికను వచ్చే ఏడాది మార్చిలో రాష్ట్ర గవర్నర్‌‌ ద్వారా అసెంబ్లీకి సమర్పిస్తామని కాగ్‌‌ అధికారులు వెల్లడించారు. అంతకుమించి తమ పర్యటనకు సంబంధించి వివరాలు చెప్పబోమని పేర్కొన్నారు. 

జులైలో ఆడిట్ ప్రారంభం.. 
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై కాగ్ నిరుడు జులై నుంచి ఆడిట్‌‌ ప్రారంభించింది. ఆగస్టు 6న కాగ్‌‌ హైదరాబాద్‌‌ అకౌంటెంట్‌‌ జనరల్‌‌ తన బృందంతో కలిసి జలసౌధకు వచ్చి ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై ఇరిగేషన్‌‌ స్పెషల్‌‌ సీఎస్‌‌ రజత్‌‌ కుమార్‌‌, ఈఎన్సీల నుంచి వివరాలు సేకరించారు. అదే నెల 25న కాగ్‌‌ ఇన్‌‌స్పెక్టింగ్‌‌ ఆఫీసర్‌‌ ప్రాజెక్టుకు సంబంధించిన పలు వివరాలను నిర్దేశిత ఫార్మాట్‌‌లో సమర్పించాలని ఇరిగేషన్‌‌ ఈఎన్సీకి లెటర్ రాశారు. ఇరిగేషన్‌‌ శాఖ అందించిన వివరాల ఆధారంగా నాలుగు నెలల క్రితం కాగ్‌‌ ఆడిట్‌‌ విభాగం ప్రత్యేక బృందాలు కాళేశ్వరంలోని పలు ప్యాకేజీలను సందర్శించి చేసిన ఖర్చుకు సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకొని ఆడిట్‌‌ మొదలుపెట్టాయి.  

కాగ్ అడిగిన వివరాలివీ... 
ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులవుతున్న వారి స్థితిగతుల అధ్యయానికి సోషియో ఎకనామిక్‌‌ సర్వే ఏమైనా చేశారా? అనే దానికి సంబంధించి ప్యాకేజీల వారీగా సమాచారాన్ని కాగ్ అధికారులు సేకరించారు. నిర్వాసితులకు పరిహారం, ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌ ప్యాకేజీ కోసం ఆర్థిక సంవత్సరాల వారీగా ఖర్చు చేసిన మొత్తం, ఇంకా ఎంత మందికి పరిహారం ఇవ్వాల్సి ఉందనే సమాచారం తీసుకున్నారు. అడిషనల్‌‌ టీఎంసీ కోసం చేసే ఖర్చు, ఆయా పనుల వివరాలు, 2 టీఎంసీలకు మించి అడిషనల్‌‌ టీఎంసీతో సమకూరే కాస్ట్‌‌ బెనిఫిట్‌‌ రేషియో, ప్రాజెక్టుకు వచ్చిన అనుమతులు, ప్రాణహిత–చేవెళ్ల నుంచి కాళేశ్వరంగా రీడిజైన్‌‌ చేయడానికి దారితీసిన పరిస్థితులు, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ప్రాణహిత డీపీఆర్‌‌ సీడబ్ల్యూసీకి సమర్పించారా? దానికి సీడబ్ల్యూసీలోని డైరెక్టరేట్ల నుంచి క్లియరెన్స్‌‌ వచ్చిందా? ఇతర శాఖల అనుమతులు ఏమైనా వచ్చాయా? అనే వివరాలు ఇవ్వాలని కాగ్‌‌ కోరింది.