న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ కుటుంబానికి ఢిల్లీ కోర్టు ఊరట కలిగించింది. ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతరులపై ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీటును కాగ్నిజెన్స్ (పరిగణనలోకి తీసుకోవడం)గా తీసుకోవడానికి కోర్టు నిరాకరించింది. అయితే, ఈ కేసులో విచారణ కొనసాగించవచ్చని ఈడీకి కోర్టు సూచించింది.
కాగా.. ఈ కేసులో గాంధీ కుటుంబానికి కోర్టు ఊరట కలిగించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. మోడీ ప్రభుత్వ అక్రమాలు, మోసాలు బట్టబయలయ్యాయని ఓ ప్రకటనలో కాంగ్రెస్ మండిపడింది. గాంధీ కుటుంబంపై రాజకీయ కక్షతోనే మోడీ సర్కారు కేసు నమోదు చేయించి వేధిస్తోందని దుయ్యబట్టింది. ‘‘ఈడీ నమోదు చేసిన కేసులో న్యాయపరిధి లేదు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఇక కేసు ఎలా అవుతుంది. గత దశాబ్ద కాలంపైగా గాంధీ కుటుంబంపై మోడీ ప్రభుత్వం కక్ష కట్టింది.
అందుకే వారిపై నేషనల్ హెరాల్డ్ కేసంటూ వేధిస్తోంది. అసలు మనీ లాండరింగ్ వ్యవహారమే లేదు, ఆస్తుల బదిలీ కూడా కాలేదు. ఈడీ చార్జిషీటులో ఆధారాలే లేవు. గాంధీ ఫ్యామిలీ ఇమేజీకి భంగం కలిగించడానికి మోడీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఈరోజు బట్టబయలయ్యాయి. మేము ఎవరికీ భయపడం. ఎందుకంటే మేము సత్యం కోసం పోరాడుతున్నాం” అని కాంగ్రెస్ ఆ ప్రకటనలో వ్యాఖ్యానించింది.
అలాగే, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా స్పందించారు. ‘‘మేము బ్రిటిష్ వాళ్లకే భయపడలేదు. ఈ బీజేపీ–ఆరెస్సెస్, మోదీ–షా ఎంత..? ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి ఈ ఓట్ చోర్ ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా.. మేము 140 కోట్ల భారతీయుల కోసం పోరాడుతూనే ఉంటాం. రాజ్యాంగాన్ని కాపాడుతాం. విజయం ఎప్పటికీ సత్యానిదే” అని ఖర్గే ‘ఎక్స్’ లో పేర్కొన్నారు.
