అగ్నిపథ్ తో అకాడమీలు మూతపడతాయనే ఆందోళనలు

అగ్నిపథ్ తో అకాడమీలు మూతపడతాయనే ఆందోళనలు
  • రైల్వే పోలీసుల విచారణలో ‌‌ఆవుల సుబ్బారావు
  • సికింద్రాబాద్‌‌ రైల్వే స్టేషన్‌‌లో ధర్నాలకే పిలుపునిచ్చాం 
  • అకాడమీ సిబ్బందితో కలిసి ప్లాన్‌‌ చేసినట్లు గుర్తింపు
  • అభ్యర్థులతో వాట్సాప్‌‌ గ్రూపుల క్రియేట్‌‌
  • పోలీసుల అదుపులో మరో 8 మంది నిందితులు

హైదరాబాద్‌, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్‌ స్కీమ్‌తో కోచింగ్‌ సెంటర్లు మూతపడతాయనే ఉద్దేశంతో ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు సాయి డిఫెన్స్‌ అకాడమీ చైర్మన్‌ ‌ఆవుల సుబ్బారావు విచారణలో చెప్పినట్లు తెలిసింది. కేవలం ధర్నాలకు మాత్రమే పిలుపునిచ్చామని, ఎలాంటి విధ్వంసాలకు ప్రేరేపించలేదని పోలీసులతో చెప్పినట్లు సమాచారం. ఏపీ పోలీసుల అదుపులో ఉన్న సుబ్బారావును సిటీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆయన్ను హైదరాబాద్‌ తరలించి రైల్వే పోలీసులకు అప్పగించారు. శుక్రవారం ఆయనను విచారించారు. అకాడమీ మేనేజర్‌‌ శివ, కో ఆర్డినేటర్స్‌ మల్లారెడ్డి, రెడ్డప్ప, హరి సహా మరో 8 మందిని గురువారం అదుపులోకి తీసుకోగా, వారిని కూడా శుక్రవారం విచారించి, స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు. శనివారం వీరిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించనున్నారు. అలాగే, బోడుప్పల్‌లోని సాయి అకాడమీకి నోటీసులు ఇవ్వగా, సంబంధిత సిబ్బంది విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. 

ఆందోళనలో 16 అకాడమీల అభ్యర్థులు.. 

ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటకలో సుబ్బారావుకు చెందిన అకాడమీల నుంచి ఆధారాలు సేకరించారు. మొత్తం 16 అకాడమీల నుంచి అభ్యర్థులు ఆందోళనలో పాల్గొన్నట్లు దర్యాప్తులో తెలింది. ఆయా అకాడమీల నుంచి ఎంత మంది అభ్యర్థులు ఆందోళనల వాట్సాప్‌ గ్రూపుల్లో ఉన్నారు. విధ్వంసం చేయడంలో ఎంత మంది పాల్గొన్నారు అనే వివరాలు రాబట్టారు. అకాడమీల ద్వారా ఏడాదికి సుమారు రూ.5 కోట్లు టర్నోవర్ వస్తుందని, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్లు సీజ్ చేసిన డ్యాక్యుమెంట్ల ఆధారంగా గుర్తించారు. అగ్నిపథ్‌తో కోచింగ్‌ సెంటర్ల నిర్వహణకు ప్రమాదం ఏర్పడనుందనే ఉద్దేశంతో ఆందోళనలకు ప్రేరేపించినట్లు స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు. ఘటన జరిగిన రోజు సుబ్బారావు సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌లో లేనట్లు 
నిర్ధారించారు. 

అందరూ కలిసి స్కెచ్‌

సుబ్బారావు అకాడమీకి చెందిన మరో 8 మందితో కలిసి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీని కోసం ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు క్రియేట్‌ చేసి అకాడమీ అభ్యర్థులను యాడ్‌ చేసినట్లు, పోలీసులు ఆధారాలు సేకరించారు. ముందుగా గుంటూరులో ర్యాలీ నిర్వహించేలా ప్లాన్ చేసినట్లు తెలుసుకున్నారు. అభ్యర్థులకు భోజనం వాటర్ ప్యాకెట్స్‌,షెల్టర్‌‌కు సంబంధిం చిన బాధ్యతలను మేనేజర్‌‌ నరేశ్‌కి అప్పగించినట్లు తెలుసుకున్నారు. ఘటనకు ముందు రోజు ( జూన్‌16న) సుబ్బారావు సికింద్రాబాద్‌ వచ్చాడని గుర్తించారు. ఓ హోటల్‌లో తన అనుచరులతో మీటింగ్ నిర్వహించి బోడుప్పల్‌లోని అకాడమీ బ్రాంచ్‌కి వెళ్లినట్లు, 17న విధ్వంసం జరగడంతో ఏపీకి పారిపోయినట్లు గుర్తించారు. కాగా, సుబ్బారావుపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన లాయర్‌‌ తెలిపారు. దాడి జరిగిన రోజు ఆయన హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో ఉన్నారని, అక్కడున్న తన అకాడమీ బ్రాంచ్‌ ఆఫీసు పనులు చూసుకోవడానికి వచ్చారని చెప్పారు. శాంతియుతంగా నిరసన తెలపాలని వారికి మద్దతు మాత్రమే ఇచ్చాడన్నారు. కార్ఖానా పోలీసులు ఫోన్‌ చేస్తే హైదరాబాద్‌లో లేనని భయపడి అబద్ధం చెప్పినట్లు పేర్కొన్నారు.