బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో 14 మందికి బెయిల్

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో 14 మందికి బెయిల్

హైదరాబాద్ బోయిన్ పల్లిలో ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 14మందికి సికింద్రాబాద్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి బుధవారం బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని.. విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టు ఇప్పటికే  బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు 21మందిని అరెస్టు చేశారు. వారిలో అఖిలప్రియ సహా 15మందికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయగా.. మరో ఆరుగురు చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, ఆమె సోదరుడు విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీను ఇంకా పరారీలోనే ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా భార్గవ్ రామ్, విఖ్యాత్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌ను సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.