రైస్​ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేయిస్తం

రైస్​ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేయిస్తం

దీక్షల పేరిట రైతుల జీవితాలతో టీఆర్​ఎస్​ ఆడుకున్నది: కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి
4. 53 లక్షల బస్తాల ధాన్యం  షార్టేజ్ బయటపడింది
ఇంత ధాన్యం ఎక్కడికి పోయింది? 

న్యూఢిల్లీ, వెలుగు: ధాన్యం అవకతవకల విషయంలో రాష్ట్రంలోని అన్ని రైస్ మిల్లుల్లో త్వరలో ఆకస్మిక తనిఖీలకు ఆదేశిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. అక్రమాలకు పాల్పడ్డ మిల్స్ పై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతామని, ఆయా రైస్ మిల్స్ పై తీసుకున్న చర్యలను కేంద్రానికి తెలపాలని కూడా లేఖ రాస్తామని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాజాగా రాష్ట్రంలో ఎఫ్ సీఐ అధికారులు చేసిన తనిఖీల్లో 4,53,896 బస్తాల ధాన్యం షార్టేజ్ బయటపడిందన్నారు. 2020–-21 కు సంబంధించి యాసంగిలో 21 మిల్లుల్లో 1,96,177 బస్తాల వడ్లు, 2021–-22 వానాకాలంలో 19 మిల్లుల్లో 2,57,719 బస్తాల ధాన్యం షార్టేజ్ వచ్చిందని వెల్లడించారు. దాదాపు 2,320 మిల్స్ లో ధాన్యం లెక్కించడానికి అనువుగా లేకుండా ఉందని, కుప్పలుగా పోసి ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల్లో చూపిస్తున్న ధాన్యం..  రైస్​ మిల్లుల్లో, గోదాముల్లో ఎందుకు లేదని ఆయన నిలదీశారు.  ‘‘ఇన్ని బ్యాగుల ధాన్యం ఎక్కడికి పోయింది? ఎవరిని మోసం చేయడానికి? షార్టేజ్ వచ్చిన ధాన్యం మళ్లీ ఎక్కడి నుంచి సర్దుబాటు చేస్తరు’’ అని  ప్రశ్నించారు.   
 

తండ్రీకొడుకుల పార్టీ సర్టిఫికెట్​ అవసరం లేదు
రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేసీఆర్  పరిహారం ఇవ్వడంలో తమకేమి ఇబ్బంది లేదని, అయితే టీఆర్ఎస్ పార్టీ రాజకీయలు, దుర్మార్గాలు, మాఫియా కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలను ముందుగా ఆదుకోవాలని, ఆ తర్వాత దేశంలో ఎక్కడి వెళ్లినా తమకేమీ అభ్యంతరం లేదని కిషన్​రెడ్డి చెప్పారు. ‘‘ముందుగా రాష్ట్రంలో చనిపోయిన రైతులు, అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలి. వ్యవసాయ రంగం అభివృద్ధిపై  తండ్రీ- కొడుకుల పార్టీ సర్టిఫికెట్ కేంద్రానికి అవసరం లేదు. మాకు దేశ రైతులు సర్టిఫికెట్ ఇచ్చారు” అని పేర్కొన్నారు.  
గోనె సంచులు లేకుంటే ఎట్లా?
రైతులు పండించిన వడ్లు కొనుగోలు చేసేందుకు దాదాపు 15 కోట్ల గోనె సంచులు అవసరమని కిషన్ రెడ్డి చెప్పారు. జనవరి నుంచే అన్ని రాష్ట్రాలు గోనె సంచులకు ప్రిపరేషన్ మొదలుపెట్టాయన్నారు. కానీ, రాష్ట్ర సర్కారు ఇప్పటివరకూ గోనె సంచుల కొనుగోలు చేయలేదని తెలిపారు. ‘‘90 శాతం వెస్ట్ బెంగాల్ లో గోనె సంచులు తయారవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈ రోజు కనీసం కోటి సంచులు కూడా లేవు. ఏ రకంగా సేకరిస్తరు? ఏ రకంగా ట్రాన్స్ పోర్ట్ చేస్తరు? కేసీఆర్, కేటీఆర్, వాళ్ల కుటుంబ సభ్యులు తట్టలల్ల బియ్యం మోస్తరా?’’ అని కిషన్​రెడ్డి నిలదీశారు. 
 

పెట్రోల్​, డీజిల్​ రేట్లు.. తెలంగాణలోనే ఎక్కువున్నయ్ -కేటీఆర్​కు కిషన్​రెడ్డి కౌంటర్​
హైదరాబాద్​, వెలుగు: పెట్రోల్​, డీజిల్​, గ్యాస్​ ధరలు తెలంగాణలోనే ఎక్కువున్నాయని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. వ్యాట్​ కూడా ఎక్కువ వసూలు చేస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణనే అని అన్నారు. పెట్రోల్​, డీజిల్​, గ్యాస్​ ధరలపై కేటీఆర్​ చేస్తున్న విమర్శలకు ఆయన బుధవారం ట్విట్టర్​లో కౌంటర్​ ఇచ్చారు. దేశంలో ద్రవ్యోల్బణం 6.99 శాతంగా ఉంటే.. తెలంగాణలో మాత్రం అంతకన్నా ఎక్కువగా 7.66 శాతం ఉందన్నారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు (7.5%) తగ్గుతుంటే.. రాష్ట్రంలో మాత్రం పెరుగుతోందని విమర్శించారు. 
2,320 మిల్లుల్లో తనిఖీలు: ఎఫ్​సీఐ
వడ్ల బస్తాల నిల్వల్లో తేడాలు ఉన్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని సివిల్‌ సప్లయ్స్‌ కమిషనర్‌ను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఎఫ్‌సీఐ జీఎం అశోక్‌ కుమార్‌ సివిల్‌ సప్లయ్స్‌ కమిషనర్‌‌కు లేఖ రాశారు. 2,320 రైస్‌ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ధాన్యం షార్టేజ్‌తో పాటు సక్రమంగా స్టాకింగ్‌ చేయని మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. 27లోగా స్టాక్‌ను లెక్కించేందుకు ఏర్పాటు చేయాలని, స్టాక్‌ నిర్వహించే మిల్లుల్లో మాత్రమే 28 నుంచి తనిఖీలు నిర్వహిస్తామని, వాటికే మిల్లింగ్‌కు అనుమతిస్తామని  చెప్పారు.