భార్యాభర్తల మధ్య మనస్పర్థలు.. ప్రస్టేషన్కు చిన్నారి బలి

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు.. ప్రస్టేషన్కు చిన్నారి బలి
  • 8 ఏండ్ల కూతురిని గొంతు కోసి హత్య చేసిన తండ్రి
  • డెడ్‌బాడీని పడేసేందుకు వెళ్తుండగా యాక్సిడెంట్ 
  • పోలీసుల ఎంట్రీతో బయటపడిన చిన్నారి హత్య 
  • నిందితుడిని అరెస్ట్..   రిమాండ్‌కు తరలింపు 

ఎల్బీ నగర్, వెలుగు: భార్యపై కోపంతో బిడ్డ గొంతు కోసి చంపాడో తండ్రి. డెడ్‌బాడీని మాయం చేయాలని కారులో తీసుకెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఆ హత్య ఘటన బయటపడింది. హైదరాబాద్‌లోని కోహెడ సమీపంలో జరిగిన ఘటన వివరాలను వనస్థలిపురం ఏసీపీ భీం రెడ్డి మీడియాకు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన కుందేటి చంద్రశేఖర్, హిమబిందుకు 2011లో వివాహం జరిగింది. 

భార్యా భర్తలిద్దరూ సాఫ్ట్​వేర్ ఉద్యోగులు కావడంతో లండన్‌లో జాబ్‌ చేసి నాలుగేండ్ల క్రితం హైదరాబాద్‌కు తిరిగి వచ్చి, కూతురు మోక్షిజ (8)తో కలసి చందానగర్ ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం చంద్రశేఖర్ ఉద్యోగం పోయింది. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థాలు వచ్చాయి. 

హిమబిందు చంద్రశేఖర్‌‌ను వదిలిపెట్టి బీహెచ్ఈఎల్‌లో ఉంటున్న తల్లిగారింట్లో ఉంటోంది. మోక్షిజ అక్కడే స్థానికంగా ఉన్న జ్యోతి విద్యాలయంలో నాలుగో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో తనను వదిలేసి పాపతో సంతోషంగా ఉంటుందని భార్యపై చంద్రశేఖర్‌‌ పగ పెంచుకున్నాడు. 

ఎలాగైనా పగ తీర్చుకొని, ఆమెకు మనశ్శాంతి లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో కన్న కూతురిని చంపాలని డిసైడ్‌ అయి, 8 రోజుల క్రితమే పెన్సిల్ కట్టర్‌‌ను కొని పెట్టుకున్నాడు. 
 

స్కూల్‌కు వచ్చి.. పాపను తీసుకెళ్లి..

బీహెచ్ఈఎల్‌లోని కూతురు మోక్షిజ చదువుతున్న స్కూల్‌కు శుక్రవారం 3.40 గంటలకు చంద్రశేఖర్‌‌ వచ్చాడు. నాన్న ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాడని ఆనందంతో ఆ పాప తండ్రి కారు ఎక్కింది. స్కూల్‌ నుంచి బయలుదేరిన 10 నిమిషాల్లోనే వెంట తెచ్చుకున్న పెన్సిల్‌ కట్టర్‌‌తో పాప గొంతు కోశాడు. ఆ తర్వాత డెడ్‌బాడీని ఎలా మాయం చేయాలని ఆలోచిస్తూ ఔటర్‌‌ రింగ్‌రోడ్డుపైకి వెళ్లగా, కోహెడ సమీపంలో చంద్రశేఖర్‌‌ కారు డివైడర్‌‌ను ఢీకొట్టడంతో బోల్తా పడింది.

 వెంటనే అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకోగా, కారులో చిన్నారి డెడ్‌బాడీని గుర్తించారు. దీంతో చంద్రశేఖర్‌‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన భార్యపై కోపంతోనే ఈ హత్య చేశానని చెప్పాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చంద్రశేఖర్‌‌ను అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు.