- ఎత్తు ఎట్ల తగ్గుతది?
- గతంలో కంటే తక్కువ ఎత్తు చూపిస్తున్నారంటూ అభ్యర్థుల ఆందోళన
- పోలీస్ ఫిజికల్ టెస్టు రీమెజర్మెంట్లో గందరగోళం
హైదరాబాద్, వెలుగు: పోలీస్ ఫిజికల్ టెస్ట్ లో అభ్యర్థుల ఎత్తు లెక్కించే డిజిటల్ మీటర్లలో లోపాలు బయటపడుతున్నాయి. గతంలో రికార్డు అయిన ఎత్తు కంటే ఇప్పుడు కొలతలు తగ్గిపోవడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈవెంట్స్ లో ఒక సెంటీమీటర్, అంతకంటే తక్కువ ఎత్తు వ్యత్యాసంతో డిస్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు హైకోర్టు ఆదేశాలు, బోర్డు నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల15 నుంచి రీ మెజర్మెంట్స్ నిర్వహిస్తున్నారు. కొండాపూర్‌లోని బెటాలియన్, అంబర్ పేట్‌లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు కొనసాగుతున్నాయి. ఆదివారం నిర్వహించిన టెస్టుల్లో భారీగా తేడాలు బయటపడ్డాయి. మొదటి ఈవెంట్స్ లో రికార్డైన ఎత్తుకంటే ఇప్పుడు నిర్వహిస్తున్న మెజర్మెంట్లో డిజిటల్ మీటర్లు ఎత్తు తక్కువ చూపిస్తున్నాయి. దీంతో కొందరు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కాస్తో కూస్తో ఎత్తు పెరగడం ఉంటుంది కానీ గతంలో అధికారులు రికార్డు చేసిన ఎత్తుకంటే తగ్గడం ఏంటని ప్రశ్నించారు. మాన్యువల్‌గా హైట్ చెక్ చేయాలని హైకోర్టు ఆదేశాలున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. డిపార్ట్మెంట్లో తెలిసిన వారిని, రికమెండేషన్స్ తో వచ్చిన వారిని నిబంధనలకు విరుద్ధంగా క్వాలిఫై చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రీమెజర్మెంట్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఒక సెంటీమీటర్, అంతకంటే తక్కువ ఎత్తులో డిస్ క్వాలిఫై అయిన వారికి కూడా మెయిన్స్ కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
