- కొనసాగుతున్న లొంగుబాట్లు, ఎన్ కౌంటర్లు
- మల్లా రాజిరెడ్డి చనిపోయినట్టు ప్రచారం
- దేవ్ జీ పోలీసుల అదుపులో ఉన్నారంటున్న కొందరు
- సామూహికంగా లొంగిపోతామంటున్న ఎంఎంసీ జోనల్ కమిటీ
హైదరాబాద్: మావోయిస్టు పార్టీ లేఖలు గందరగోళానికి తెరతీస్తున్నాయి. ఎంఎంసీ కమిటీ మూడు రోజుల క్రితం రాసిన లేఖకు, ఇవాళ్టి లెటర్ ను పరిశీలిస్తే ఇది అర్థమవుతోంది. ఈ నెల 24న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ జోనల్ కమిటీ పేరుతో ఒక లేఖ విడుదలైంది. కూంబింగ్ ఆపేస్తే ఆయుధాలు వదిలేస్తామని, ఈ విషయాన్ని సెంట్రల్ కమిటీకి కూడా చెప్పామని, ఇందుకోసం ఫిబ్రవరి 15 వ తేదీ వరకు గడువు ఇవ్వాలని కోరారు. ఆపరేషన్ కగార్ మొదలైనప్పటి నుంచి ఈ లేఖల పరంపర కొనసాగుతోంది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్, జగన్, వికల్ప్ పేర్లతో ఈ లేఖలు వస్తున్నాయి.
సెప్టెంబర్ లో కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ బయటికి వచ్చింది. సాయుధ పోరాటాన్ని విరమించడానికి సిద్ధంగా ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిని మరో అధికార ప్రతినిధి జగన్ ఖండించారు. "అభయ్ లేఖలోని అంశాలు పార్టీ అంగీకారంతో వెలువడినవి కావు. అది ఆయన వ్యక్తిగతంగా చేసిన ప్రకటన మాత్రమే. పార్టీ విధానం ప్రకారం, ఈ తరహా కీలక ప్రకటనలు అధికారిక చర్చల తర్వాత మాత్రమే వెలువడాలి. ఆయుధ విరమణపై పార్టీగా ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు" అని చేశారు.
ఈ లేఖ వచ్చిన నెల రోజుల తర్వాత పార్టీకేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు, ఆశన్న లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ రావు 22 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. జగన్ లేఖను తప్పు పట్టారు. పార్టీ పంథానే తప్పన్నారు. తాము ఎందుకు లొంగిపోతోబోతున్నామో అందులో వివరించారు. తర్వాత మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయారు. ఆ తర్వాత తక్కళ్ల పల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న కూడా ఛత్తీస్ గఢ్ డీజీపీ ఎదుట లొంగిపోయారు.
నిర్బంధం వేళ.. విభేదాలు
నూతన ప్రజాస్వామిక విప్లవం పేరిట అడవి బాట పట్టిన అన్నల్లో విభేదాలు వచ్చాయా..? క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన మావోయిస్టు పార్టీ ప్రాభవం కోల్పోతున్నదా..? సమర్థ నాయకత్వం లేమితో ఎక్కడికక్కడ అభిప్రాయ బేధాలు వస్తున్నాయా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది. వరుసగా జరిగిన ఎన్ కౌంటర్లలలో మావోయిస్టు పార్టీ కేంద్ర స్థాయి నాయకులతో పాటు కేంద్రకమిటి కార్యదర్శి మృతి చెందారు. ఎన్ కౌంటర్లలో కేంద్ర కమిటీ సభ్యులు ఉదయ్ అలియాస్ గాజర్ల రవి, మోడెం బాలకృష్ణ, పరేవశ సోరెన్ కూడా మృతి చెందారు.
రాష్ట్ర కమిటీ సభ్యులు గౌతమ్, భాస్కర్, అరుణ, జగన్ అలియాస్ పండన్న, పండు అలియాస్ చంద్రహాస్ వంటివారు కూడా కన్నుమూశారు. మావోయిస్టు పార్టీ కీలక నేత మాడ్వి హిడ్మా, ఆయన సతీమణి రాజే తో పాలు కీలక నేతలు నేలకొరగడం, నిర్బంధం ఆ పార్టీ నేతలను ఉక్కిరి బిక్కరి చేస్తోంది. ఆయుధం వదలడలా.. ఆయువు కాపాడుకోవడమా..? అనేది మావోయిస్టులకు పెను సవాలుగా మారింది.
పోలీసుల అదుపులో దేవ్ జీ?
మావోయిస్టు పార్టీ నూతన సారథి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ పోలీసుల అదుపులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఏపీసీఎల్సీ నేతలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మ్యాండమస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 18న హిడ్మా ఎన్ కౌంటర్ రోజున దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. తమ దేవ్ జీ తమ అదుపులో లేరని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. అయితే ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నారని, ఏపీలో అదుపులోకి తీసుకున్నారని పౌరహక్కుల నేతలు చెబుతున్నారు. ఆయన లొంగుబాటుకు ఏర్పాట్లు చేస్తున్నారనే వాదన కూడా బలంగానే వినిపిస్తోంది.
మల్లా రాజిరెడ్డి చనిపోయారా..?
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సాయన్న, అలియాస్ మీసాల సత్తెన్న చనిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. యాభై సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన అనారోగ్యంతో కన్నుమూశారని కథనాలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు ధ్రువీకరించడం లేదు
