దేశం కోసం వాళ్లంతా కలిసొచ్చారు.. కాంగ్రెస్​, ఇతర ప్రతిపక్ష పార్టీలపై పరోక్షంగా పీఎం ఫైర్​

దేశం కోసం వాళ్లంతా కలిసొచ్చారు.. కాంగ్రెస్​, ఇతర ప్రతిపక్ష పార్టీలపై పరోక్షంగా పీఎం ఫైర్​
  • దేశం కోసం వాళ్లంతా కలిసొచ్చారు
  • కాంగ్రెస్​, ఇతర ప్రతిపక్ష పార్టీలపై పరోక్షంగా పీఎం ఫైర్​
  • ఇండియాపై ప్రపంచ అంచనాలు పెరుగుతున్నయ్ 
  • జీ20 ప్రెసిడెన్సీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని వెల్లడి

న్యూఢిల్లీ/చెన్నై:  మనదేశంలో పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ ప్రతిపక్షాలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా తప్పుబట్టారు. ఆస్ట్రేలియాలో తాను పాల్గొన్న కార్యక్రమానికి 20 వేల మంది ప్రజలు, ప్రధాని, మాజీ ప్రధాని, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు హాజరయ్యారని, ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి లేదన్నారు. ‘‘సిడ్నీలో జరిగిన కార్యక్రమంలో ఆసీస్ ప్రధాని ఆంథోనీ అల్బనీస్, అధికార పార్టీ ఎంపీలతోపాటు మాజీ ప్రధాని, ప్రతిపక్ష ఎంపీలు పాల్గొన్నారు. తమ దేశం కోసం వారంతా కలిసి వచ్చారు. కమ్యూనిటీ ఈవెంట్‌‌‌‌లో వారంతా భాగమయ్యారు. ఇది భారతీయుల పట్ల వారికున్న గౌరవాన్ని తెలియజేస్తోంది. భారత్, ఆస్ట్రేలియా సంబంధాల పటిష్టతను నొక్కి చెబుతున్నది” అని మోడీ చెప్పారు. జపాన్, పపువా న్యూ గినియా, ఆస్ట్రేలియా దేశాల పర్యటన తర్వాత గురువారం ఢిల్లీకి ప్రధాని చేరుకున్నారు. పాలం ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు బయట తనకు ఆహ్వానం పలికేందుకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.

వ్యాక్సిన్లు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు

కరోనా సమయంలో వ్యాక్సిన్లు పంపినందుకు పసిఫిక్ ద్వీప దేశాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారని మోడీ  వివరించారు. గతంలో విదేశాలకు వ్యాక్సిన్‌‌‌‌ను సరఫరా చేయడాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించడంపై ఈ సందర్భంగా మండిపడ్డారు. ‘‘సంక్షోభ సమయంలో.. ప్రపంచానికి మోడీ ఎందుకు వ్యాక్సిన్లు ఇస్తున్నారని వాళ్లు ప్రశ్నించారు. గుర్తుపెట్టుకోండి.. ఇది బుద్ధుడు, గాంధీ జీవించిన భూమి. మన శత్రువులను కూడా మనం కాపాడుతాం. ఎందుకంటే మనం కరుణతో స్ఫూర్తి పొందిన మనుషులం” అని అన్నారు. ‘‘భారతదేశం కథను వినడానికి ప్రపంచం ఆసక్తిగా ఉంది. భారతీయులు తమ గొప్ప సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడేటప్పుడు బానిస మనస్తత్వంతో బాధపడకూడదు. అందుకు బదులుగా ధైర్యంగా మాట్లాడాలి” అని సూచించారు. మన దేశంలోని పుణ్యక్షేత్రాలపై దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదని తాను చెప్పినప్పుడు ప్రపంచం తనతో ఏకీభవించిందని అన్నారు.

సెంగోల్.. అలహాబాద్‌‌‌‌ టు ఢిల్లీ

1947 ఆగస్టులో ఇంగ్లాండ్ నుంచి అధికార మార్పిడికి గుర్తుగా లార్డ్ మౌంట్ బాటన్ నుంచి తొలి ప్రధాని జవహర్‌‌‌‌‌‌‌‌లాల్ నెహ్రూ సెంగోల్ (రాజదండం) అందుకున్నారు. అప్పటి నుంచి దీనిని అలహాబాద్‌‌‌‌ మ్యూజియం నెహ్రూ గ్యాలరీలో ఉంచారు. ఇప్పుడు కొత్త పార్లమెంటు బిల్డింగ్‌‌‌‌లో పెట్టేందుకు ఢిల్లీకి తరలించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.  

నా మాట.. 140 కోట్ల గొంతుక

ఆరు రోజుల విదేశీ పర్యటనలో ప్రతిక్షణాన్ని దేశ ప్రయోజనాల కోసమే ఉపయోగించానని ప్రధాని అన్నారు. ‘‘ఇండియా గురించి, భారతీయుల బలం గురించి ఎంతో కాన్ఫిడెంట్‌‌‌‌తో చెప్పాను. ఎందుకంటే ఇక్కడి ప్రజలు మెజారిటీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. నేను చెప్పే ప్రతి మాట.. 140 కోట్ల మంది ప్రజల గొంతుక అని ప్రపంచ నేతలకు తెలుసు” అని మోడీ అన్నారు. మూలాలను పటిష్టం చేసుకునే సవాళ్లను భారతదేశం ఎదుర్కొంటుందని, అదే సమయంలో ప్రపంచం ఆశించిన విధంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. ‘‘సవాళ్లు పెద్దవి. కానీ సవాళ్లను సవాలు చేయడం నా స్వభావం. అంచనాలను సకాలంలో అందుకోవడంలో మా ప్రభుత్వం విజయం సాధిస్తుంది’’ అని అన్నారు. మన దేశంపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెరిగిపోతున్నాయని చెప్పారు.