పినరయి విజయన్ రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్

పినరయి విజయన్ రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్

కేరళ : బంగారం అక్రమ రవాణా కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ తిరువనంతపురంలో కాంగ్రెస్‌ యువజన కార్యకర్తలు నిరసన చేపట్టారు. బంగారం స్మగ్లింగ్ కేసులో కేరళ సీఎం పినరయి విజయన్ రాజీనామా చేయాలంటూ సచివాలయం ఎదుట ఆందోళనలు చేశారు. దీంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించారు.

బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్‌ జూన్ 22వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.

మరోవైపు.. కొచ్చిలోనూ ఆందోళనలు ఉధృతంగా సాగాయి. ఇక్కడ బీజేపీ యువమోర్చా కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. కేరళ సీఎం పినరయి విజయన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించారు.

మరోవైపు ... జూన్ 13న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​కు విమాన ప్రయాణంలో ఊహించని సంఘటన ఎదురైంది. యూత్​ కాంగ్రెస్​కు చెందిన ఇద్దరు కార్యకర్తలు నల్ల చొక్కాలు ధరించి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన ఎల్​డీఎఫ్​ కన్వీనర్​ ఈపీ జయరాజన్​.. ఇద్దరు నిరసనకారులను వెనక్కి నెట్టేశారు. వారు నినాదాలు చేస్తుండగా జయరాజన్​ వారిని తోసేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సంఘటన కేరళలోని కన్నూర్​ నుంచి తిరువనంతపురం​ వెళ్లే విమానంలో జరిగింది. 

బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్న సురేష్ ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. సీఎం, ఆయన కుటుంబ సభ్యులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వారికి కూడా ఇందులో భాగం ఉందంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. 

30 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేష్ తో పాటు సందీప్ నాయర్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 2020 జులైలో కస్టడీలోకి తీసుకుంది. 16 నెలల జైలు జీవితం తర్వాత గత ఏడాది నవంబర్ లో స్వప్న సురేష్ విడుదలయ్యారు.