నెట్వర్క్, వెలుగు : నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీని నిరసిస్తూ, అందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, వివిధ విద్యార్థి, నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో గురువారం భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రస్తారోకోలు నిర్వహించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు విద్యార్థులపై జరిగిన దాడులు, అక్రమ అరెస్టులు, లాఠీఛార్జీలను నాయకులు తీవ్రంగా ఖండించారు. నల్గొండ, యాదాద్రి భువనగిరి, దేవరకొండ, కొల్లాపూర్, వంగూరు, హన్వాడ తదితర ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.
చేర్యాల, మద్దూరు, తలకొండపల్లిలలో రాస్తారోకోలు చేపట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ఇతర కాంగ్రెస్, అంబేద్కర్ యువజన సంఘాల నేతలు మాట్లాడారు. బీజేపీ పాలనలో జాతీయ స్థాయి పరీక్షల విశ్వసనీయత పూర్తిగా దెబ్బతిన్నదని, ప్రశ్నించే గొంతులను నొక్కేందుకే రాహుల్ గాంధీపై దాడులకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖనీ చేస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్ నగర్ లో వందలాదిమంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తూప్రాన్ లో స్థానిక కాంగ్రెస్ నాయకులు వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టగా, నకిరేకల్, ఆమనగల్లు మండలాల్లోనూ నిరసనల హోరు కొనసాగింది.
