కర్నాటక బీజేపీ నేతకు మోడీ ఫోన్.. తప్పుపట్టిన ప్రతిపక్షాలు

కర్నాటక బీజేపీ నేతకు మోడీ ఫోన్.. తప్పుపట్టిన ప్రతిపక్షాలు

అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటక రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. టిక్కెట్లు దక్కని బీజేపీ సీనియర్ నాయకులు ఆ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. కొందరు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. మరికొందరు బీజేపీలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలు, ప్రచారాలకు దూరంగా ఉంటున్నారు.

బీజేపీలో చాలా సీనియర్ లీడర్ కేఎస్ ఈశ్వరప్ప. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతేడాది వరకూ మంత్రిగానూ పని చేశారు. అయితే.. అవినీతి ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ అధిష్టానం కేఎస్ ఈశ్వరప్పకు టిక్కెట్ ఇవ్వలేదు. కనీసం తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా తన కుమారుడు కేఎస్ కాంతేష్ కు ఇవ్వాలని అడిగారు. అయితే సీనియర్ నేత అభ్యర్థనను పట్టించుకోకుండా చెన్నబసప్పకు టిక్కెట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. దీంతో తీవ్ర నిరాశ చెందిన ఆయన రాజకీయాలకు గుడ్‌ బై చెబుతూ బహిరంగ ప్రకటన చేశారు. కేఎస్ ఈశ్వరప్ప తరహాలో కొందరు సీనియర్లు టిక్కెట్లు దక్కకపోవడంతో భంగపడి ఇతర పార్టీల్లోకి వెళ్లారు. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం టికెట్లు ఆశించి భంగపడ్డ బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న క్రమంలో.. పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇప్పటికే చాలామంది సీనియర్లకు ప్రత్యామ్నాయ హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేయడంతో ఆయన ఉబ్బితబ్బయ్యారు. శుక్రవారం (ఏప్రిల్ 21న) ఉదయం ఈశ్వరప్పకు స్వయంగా మోడీ ఫోన్‌ చేశారు. ‘‘మీలాంటి గొప్ప నేత.. నాలాంటి ఓ సాధారణ కార్యకర్తకు ఫోన్‌ చేయడం గొప్పగా భావిస్తున్నా’’ అని మోడీతో ఈశ్వరప్ప అన్నారు. తాను ఇంతకాలం ప్రాతినిధ్యం వహించిన శివమొగ్గ నియోజకవర్గంలో బీజేపీ తరపున బరిలో ఉన్న చెన్నబసప్ప తరపున తాను ప్రచారం సైతం చేస్తానని మోడీకి హామీ ఇచ్చారు. కర్ణాటకలో బీజేపీ గెలుపునకు తన శాయశక్తులా కృషిచేస్తానని ఈశ్వరప్ప.. మోడీకి హామీ ఇచ్చారు. 

తప్పుపట్టిన కాంగ్రెస్ 

అవినీతి ఆరోపణలు వచ్చిన నేతకు ప్రధాని మోడీ ఫోన్ చేసి మాట్లాడారని, బీజేపీ అవినీతిని సమర్థిస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల టికెట్ ఇవ్వనప్పటికీ తిరుగుబాటు చేయనందుకు ఈశ్వరప్పను ప్రధాని అభినందించడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.

కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న  కేఎస్ ఈశ్వరప్ప.. బెలగావిలో పబ్లిక్ వర్క్స్‌లో 40 శాతం కమీషన్ వసూలు చేశారని సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కేఎస్ ఈశ్వరప్పపై విమర్శలు రావడంతో 2022, ఏప్రిల్ లో రాజీనామా చేశారు.