కన్నూర్: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎల్‌డీఎఫ్ (లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్) విజయం సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్), అటు ఎల్‌డీఎఫ్, ఇటు బీజేపీల ఉమ్మడి కూటమితో పోరాడుతోందని పునరుద్ఘాటించారు. మంగళవారం కన్నూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
‘‘ఈ ఎన్నికలు విరుద్ధ భావజాలలు కలిగిన సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్, యూడీఎఫ్‌ల మధ్య జరుగుతున్న సైద్ధాంతిక పోరాటం. చరిత్రలో మొదటిసారిగా బీజేపీ, లెఫ్ట్ ఫ్రంట్ మధ్య భాగస్వామ్యాన్ని మనం చూస్తున్నాం. పరస్పర విరుద్ధ భావజాలాలు కలిగిన వామపక్షం, అతివాద పక్షంతో ఎలా చేతులు కలుపుతుందో అర్థం కావడం లేదు.
ఇది ఒక చిక్కుముడిలా ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ అసలైన వామపక్షం కాదని, ఇది ఒక కార్పొరేట్ పార్టీగా మారిపోయిందని రాహుల్ గాంధీ విమర్శించారు. అందుకే వారు బీజేపీతో జతకడుతున్నారని, నిజమైన వామపక్ష భావజాలం ఉన్నవారు ప్రస్తుతం కాంగ్రెస్‌తో ఉన్నారని పేర్కొన్నారు.
