న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెల రోజులుగా కొనసాగుతుతోన్న యుద్ధంతో క్రూడాయిల్ ధరలు ఆకానంటుతున్నాయి. ఈ యుద్ధ ప్రభావంతో ఇప్పటికే పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. ముడి చమురు ధరల పెంపు ప్రభావం తాజాగా విమానరంగంపై పడింది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల కారణంగా దేశంలో విమాన ఇంధన ధరలు అమాంతం పెరిగాయి. దేశ చరిత్రలో మొదటిసారిగా ఫ్యూయల్ జెట్ ధర ( ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్) కిలో లీటరుకు 2 లక్షల రూపాయల మైలురాయిని క్రాస్ చేసింది.
ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు జెట్ ఫ్యూయల్ ధరలను 114.5 శాతం పెంచడంతో బుధవారం (ఏప్రిల్ 1) ఢిల్లీలో కిలోలీటరు ఏటీఎఫ్ ధర రూ. 2.07 లక్షలకు ఎగబాకింది. ఒకే సారి కిలోలీటరుకు లక్ష రూపాయలకు పైన ధర పెరగడంతో చరిత్రలో ఫస్ట్ టైమ్ ఏటీఎఫ్ రేటు రూ.2 లక్షల మార్కును టచ్ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య తలెత్తిన ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 140 డాలర్ల పైకి చేరడమే ఏటీఎఫ్ ధరల అసాధారణ పెరుగుదలకు ప్రధాన కారణం. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన సమయంలో విమాన ఇంధనం ధరలు భారీగా పెరిగాయి.
అప్పట్లో నమోదైన గరిష్ట స్థాయిని లేటేస్ట్గా పెరిగిన ధరలు క్రాస్ చేశాయి. ఎయిర్ లైన్స్ సంస్థలు నిర్వహణ ఖర్చులలో దాదాపు 40 శాతం ఇంధనానికే కేటాయిస్తున్నాయి. మరోవైపు పశ్చిమ ఆసియాలోని గగనతల పరిమితుల కారణంగా సుదీర్ఘంగా దారి మళ్లింపులు ఎదుర్కొంటూ సతమతమవుతోన్న విమానయాన సంస్థలకు భారీగా పెరిగిన ఏటీఎఫ్ ధరలు మరింత భారం కానున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడానికి విమానయాన సంస్థలు టికెట్ ధరలు పెంచే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఫ్లైట్ టికెట్ రేట్స్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది.
