అంత డ్రామా అవసరం లేదు: ‘రాఫెల్ ఆయుధ పూజ’పై కాంగ్రెస్

అంత డ్రామా అవసరం లేదు: ‘రాఫెల్ ఆయుధ పూజ’పై కాంగ్రెస్

రాఫెల్ యుద్ధ విమానానికి ఆయుధ పూజ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. అంత డ్రామా చేయడాల్సిన అవసరం లేదని, ఇదంతా షో ఆఫ్ అని ఆరోపించింది. అసలు విజయ దశమికి, రాషెల్ కు సంబంధం ఏంటని ప్రశ్నించింది.

ఫ్రాన్స్ నుంచి తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిన్న అధికారికంగా స్వీకరించారు. విజయదశమి సందర్భంగా దానికి ఆయన ఆయుధ పూజ చేశారు. రాఫెల్ ఫైటర్ జెట్ పై కుంకుమతో ఓం రాసి, పూలు పెట్టారు. టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి ఆయుధ పూజ పూర్తి చేశారు.

దసరాకు, రాఫెల్ కు సంబంధమేంటి?

రాఫెల్ కు ఆయుధ పూజ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతోంది. దసరా పండుగకు, రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధం ఏంటని ఆ పార్టీ సీనియర్ నేత సందీప్ దీక్షిత్ ప్రశ్నించారు. విజయ దశమిని అందరం జరుపుకుంటామని, కానీ రాఫెల్ తో దీనికి  లింక్ పెట్టడం ఎక్కడా మ్యాచ్ కాలేదని అన్నారాయన.

రాఫెల్ ని రిసీవ్ చేసుకోవాల్సింది మన బలగాలే కానీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కాదు అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో వచ్చిన సమస్య ఇదేనని, వాళ్లు సందర్భం ఏదైనా సరే దాన్ని పెద్ద డ్రామా చేసేస్తారని ఎద్దేవా చేశారు.

రాఫెల్ ని సర్టిఫై చేయాల్సింది వాయుసేన

రాఫెల్ యుద్ధ విమానాన్ని స్వీకరించేందుకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫ్రాన్స్ కు వెళ్లడం, అక్కడ ఆయుధ పూజ చేయడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కూడా తప్పు పట్టారు. రాజ్ నాథ షో ఆఫ్ చేశారన్నారు. దీనికి అంత డ్రామా చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎవరూ వెళ్లకున్నా యుద్ధ విమానాలు భారత్ కు వస్తాయని ఎద్దేవా చేశారు.

గతంలో తమ ప్రభుత్వం బోఫోర్స్ వంటి ఆయుధాలను కొనుగోలు చేసినప్పుడు ఎవరూ వెళ్లలేదని చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానంలో రాజ్ నాథ్ ప్రయాణించి, చాలా బాగుందని కామెంట్ చేయడంపై కూడా ఖర్గే సెటైర్లు వేశారు. వాటిని జడ్జ్ చేయాల్సింది భారత వాయుసేన అధికారులని చెప్పారు. ‘వీళ్లు వెళ్లి, షో ఆఫ్ చేయడం, రాఫెల్ లో కూర్చుని ప్రయాణించడం అంతా అవసరం లేదు’ అని అన్నారు ఖర్గే.