కాంగ్రెస్​ ప్రచార కార్లను అక్రమంగా సీజ్​ చేసిన్రు.. సీఈవోకు నేతల ఫిర్యాదు

కాంగ్రెస్​ ప్రచార కార్లను అక్రమంగా సీజ్​ చేసిన్రు.. సీఈవోకు నేతల ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు :  బీఆర్ఎస్ ప్రభుత్వ​ వైఫల్యాలు, అవినీతిపై తయారు చేయించిన తమ ప్రచార కార్లను పోలీసులు అక్రమంగా ఎత్తుకెళ్లిపోయారని కాంగ్రెస్​ మండిపడింది. శుక్రవారం రాత్రి గాంధీభవన్​లో ఎవరూ లేని సమయంలో వచ్చి తమ ప్రాపర్టీలను తీసుకెళ్లి సీజ్​ చేశారని ఆరోపించింది. ఈ మేరకు రాష్ట్ర చీఫ్​ ఎలక్టోరల్​ఆఫీసర్​ వికాస్​ రాజ్​కు పీసీసీ వైస్​ ప్రెసిడెంట్​ చామల కిరణ్​ కుమార్​ రెడ్డి నేతృత్వంలోని పార్టీ లీడర్లు సోమవారం ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్​ వైఫల్యాలపై గురువారం గాంధీభవన్​ ఆవరణలో కార్​ క్యాంపెయిన్​ను ప్రారంభించామని, ఆ కార్లను గాంధీభవన్​ ఆవరణలోనే పార్క్​ చేసుకున్నామని, ఏ చట్టాన్నీ, నిబంధనలను అతిక్రమించలేదని వికాస్​రాజ్​కు చేసిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు.

అయితే, ఆ తర్వాతి రోజు రాత్రి గాంధీభవన్​ ఆవరణలోకి ప్రవేశించిన పోలీసులు అక్రమంగా ఆ కార్లను సీజ్​ చేసి బేగంబజార్​ పోలీస్​స్టేషన్​కు తరలించారని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు సరైన వివరణ ఇవ్వలేదని, ఈ ఘటన ప్రైవేటు ఆస్తుల రక్షణ హక్కును ఉల్లంఘించేలా ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లకు ఆన్సర్​ చేయాల్సిందిగా కోరారు. ‘‘గాంధీభవన్​ పరిసరాల్లోకి ఎంటరై మా ఆస్తులను సీజ్​ చేయడానికి గల కారణాలను రాతపూర్వకంగా చెప్పాలి. మా ప్రచారం చట్టబద్ధమే అయితే వెంటనే మా వాహనాలను మాకు అప్పగించాలి. పోలీసుల చర్యలు తప్పని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని సీఈవోను కోరారు.