
హైదరాబాద్, వెలుగు : పదేండ్లు ప్రజలను దోచుకోవడమే ఎజెండాగా బీఆర్ఎస్ నేతలు పాలించారని ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ విమర్శించారు. ఇంకా అధికారంలోనే ఉన్నామన్న మత్తులోనే కేటీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్అయ్యారు. ఇన్నేండ్లు రాష్ట్రాన్ని దోచుకున్న గాడిద.. కాంగ్రెస్ వి420 హామీలంటూ మాట్లాడుతున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డితో కలిసి గురువారం గాంధీభవన్లో బెల్లయ్య నాయక్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 30 రోజులైనా కాకముందే ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో అధికారులు ఎక్కడా పనిచేయలేదన్నారు. లక్షల కోట్లు అప్పులు చేసి కాళేశ్వరం కడితే.. ఆ ప్రాజెక్టు కుంగిపోయిందని, అప్పుడు కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి పనిలేదన్నారు. పదేండ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. విభజన హామీలను ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు.