నైతిక బాధ్యత వహించడానికి కాంగ్రెస్ ఏనాడూ సిగ్గుపడలేదు : రాహుల్ గాంధీ

 నైతిక బాధ్యత వహించడానికి  కాంగ్రెస్ ఏనాడూ సిగ్గుపడలేదు : రాహుల్ గాంధీ

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.  ప్రస్తుతం ఆమెరికా పర్యటనలో ఉన్న  ఆయన..  న్యూయార్క్‌లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా  ఒడిశా రైలు ప్రమాదంపై  మాట్లాడిన రాహుల్ ..  ఈ  రైలు ప్రమాదం ఎందుకు జరిగిందని బీజేపీ నేతలను అడగండి వారు 50 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ఇలాగే  చేసిందని  చెబుతారని అన్నారు. బీజేపీఎప్పుడూ గతాన్ని తిరిగి చూస్తుందని, నిందను దాటవేస్తుందని ఆరోపించారు .

బీజేపీ తన తప్పులను ఒప్పుకోకపోవడం అలవాటుగా మారిందన్న రాహుల్ ..  తప్పుల గురించి  ప్రశ్నించినప్పుడు కాంగ్రెస్‌పై నిందలు మోపుతుందని చెప్పారు.  కాంగ్రెస్ హయాంలో జరిగిన రైలు దుర్ఘటనలపై కూడా రాహుల్ మాట్లాడారు. అప్పడు జరిగిన సంఘటనలకు నైతిక బాధ్యత వహించి అప్పటి రైల్వే మంత్రి రాజీనామా చేశారని గుర్తుచేశారు.

అంతేకానీ రైలు ఢీకొట్టడానికి బ్రిటిష్ వారి తప్పు అని చెప్పి తప్పించుకోలేదన్నారు. తమ పార్టీ  నైతిక  బాధ్యత వహించడానికి ఏనాడూ  సిగ్గుపడలేదని అన్నారు.   ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వాస్తవాన్ని స్వీకరించలేక సాకులు చెబుతుందని విమర్శించారు .  ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన వారికి 60 సెకన్ల పాటు రాహుల్ మౌనం పాటించారు.