దేశ సంప్రదాయాలను కాంగ్రెస్ గౌరవిస్తలే : కిషన్ రెడ్డి

దేశ సంప్రదాయాలను కాంగ్రెస్ గౌరవిస్తలే : కిషన్ రెడ్డి
  • ఆ పార్టీది విదేశాల నుంచి దిగుమతి 
  • చేసుకున్న నాయకత్వం: కిషన్‌‌‌‌రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌ది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నాయకత్వమని, అలాంటి పార్టీ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను ఏమాత్రం గౌరవించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. హిందువుల జీవన విధానమంటే కాంగ్రెస్‌‌‌‌కు చులకన అని మండిపడ్డారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.

 ‘‘అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించి హిందూ వ్యతిరేక ధోరణిని అవలంబిస్తున్నది. ఈ నెల 22న జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అంటే కాంగ్రెస్‌‌‌‌కు ఎందుకంత కంటగింపు? ఎందుకు ఆడిపోసుకుంటున్నది? కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, లోక్​సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరిని శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానించింది. ఈ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడం వారి దివాళాకోరుతనమే” అని ఫైరయ్యారు. 

అభద్రతాభావంతో, కుహనా లౌకికవాదంతో, సూడో సెక్యులరిస్టులుగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని, హిందుత్వ వ్యతిరేక వైఖరిని చాటుకున్నారని మండిపడ్డారు. ‘‘గతంలో జీ 20 సమావేశాలను, పార్లమెంటు సమావేశాలను కాంగ్రెస్ బహిష్కరించింది. చివరికి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇస్తే ఆ కార్యక్రమాన్ని బహిష్కరించింది. కాంగ్రెస్ పూర్తి అభద్రతాభావంతో సహాయ నిరాకరణ చేస్తూ.. దేశ సామరస్యాన్ని దెబ్బతీసేలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది. ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ లో శాంతిభద్రతలను కాపాడితే దాన్ని కూడా ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నది. హిందువులకు సంబంధించిన ప్రతి అంశంపై రాజకీయం చేయడమే ఆనవాయితీగా పెట్టుకుంది” అని విమర్శించారు.

అక్షింతల పంపిణీని అడ్డుకోవడం దుర్మార్గం

అయోధ్య నుంచి వచ్చిన పూజిత అక్షింతలను హైదరాబాద్‌‌‌‌లో భక్తి భావనతో ప్రతి ఇంటికి పంపిణీ చేస్తుంటే సికింద్రాబాద్​లో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం దుర్మార్గమని కిషన్‌‌‌‌ రెడ్డి మండిపడ్డారు. గత నెల 29న సికింద్రాబాద్‌‌‌‌లోని సింధూ కాలనీలో అక్షింతల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేశారని, మజ్లిస్ మెప్పు పొందడం కోసం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. 

ఏపీలో ట్రైన్ సర్వీసుల పొడిగింపు: కిషన్ రెడ్డి

ఏపీలో మూడు రైళ్ల సర్వీసులను ఆ శాఖ పొడిగించింది. వీటిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుంటూ రులో శుక్రవారం ప్రారంభించనున్నారు. వైజాగ్, విజయవాడ మధ్య నడిచే ఉదయ్ ఎక్స్ ప్రెస్  గుంటూరు వరకు, విజయవాడ, హుబ్లీ మధ్య నడిచే అమరావతి ఎక్స్​ప్రెస్ నర్సాపూర్ వరకు, నంద్యాల, కడప ఎక్స్ ప్రెస్ రేణిగుంట వరకు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.