నిజామాబాద్, వెలుగు: కొత్తగా ఎన్నికైన మున్నూరుకాపు మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను సన్మానించేందుకు నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ ధర్మపురి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సన్మాన సభలో వింత ఘటన చోటు చేసుకుంది. ప్రోగ్రాంకు బీజేపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు హాజరు కాలేదు. దీంతో వారికి కేటాయించిన ఖాళీ కుర్చీలను సన్మానించడం ఆసక్తి రేపింది. కాంగ్రెస్‌కు చెందిన సంజయ్ మున్నూరు కాపు జిల్లా సంఘానికి ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈక్రమంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిచిన మున్నూరుకాపులను సన్మానించేందుకు ప్రగతినగర్ మున్నూరుకాపు సంఘ భవనంలో ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు హాజరు కాగా వారిని సన్మానించారు. బీజేపీకి చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మాత్రం రాలేదు. ఎంపీ అర్వింద్ బీజేపీ కీలక నేత కాగా, ఆయన సోదరుడు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విబేధాలున్నాయి.
దీంతో ఎక్కడ ఎంపీ అర్వింద్ ఆగ్రహానికి గురి కావల్సి వస్తుందోనని బీజేపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీనిపై సంజయ్ తన స్పీచ్‌లో ఘాటుగా స్పందించారు. తన తండ్రి డి.శ్రీనివాస్ ఆశయాల మేరకు కాపు కులస్తులను కలుపుకొని వెళ్లాలని ప్రయత్నిస్తుంటే, కొన్ని అరాచకశక్తులు అడ్డుకుంటున్నాయని ఫైర్ అయ్యారు. కులానికి కూడా రాజకీయాలు అంట గట్టడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ ఆకుల సుజాత పాల్గొన్నారు.
