అదానీ విద్యుత్​పై కాంగ్రెస్ ద్వంద్వ నీతి : కేటీఆర్

అదానీ విద్యుత్​పై కాంగ్రెస్ ద్వంద్వ నీతి : కేటీఆర్
  •  మహారాష్ట్రలో అదానీ సంస్థకు వ్యతిరేకంగా నిరసన
  • అదే సంస్థకు రాష్ట్రంలో స్వాగతం 

హైదరాబాద్, వెలుగు: గౌతమ్  అదానీ విద్యుత్  సంస్థల వ్యవహారంలో కాంగ్రెస్  సర్కారు ద్వంద వైఖరి అవలంబిస్తోందని బీఆర్‌‌‌‌ఎస్  వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్  అన్నారు. అదానీ విషయంలో కాంగ్రెస్  స్టాండ్ ఏంటో అర్థం చేసుకోవడం కష్టం అని ఆయన ట్వీట్  చేశారు. అదానీ విద్యుత్ సంస్థకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో కాంగ్రెస్  నిరసన కార్యక్రమాలు చేపట్టిందని, మరోవైపు అదే సంస్థకు తెలంగాణలో స్వాగతం చెప్పిందన్నారు. ఈ విషయంలో రాహుల్  గాంధీ స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్  చేశారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ను అధికారంలోకి తెచ్చేందుకు యువతను రాహుల్‌‌  వాడుకున్నారని  పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులను అవమానించేలా మాట్లాడిన సీఎం రేవంత్‌‌ రెడ్డి.. వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక అత్యుత్సాహం ప్రదర్శిస్తూ చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసులను అదుపు చేయాలని డీజీపీని కోరుతూ కేటీఆర్  ట్వీట్ చేశారు. 

రాష్ట్ర యువతతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. సోషల్  మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని మండిపడ్డారు. తొర్రూరు నియోజకవర్గంలో మాలోతు సురేష్ బాబు అనే గిరిజన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని క్రూరంగా హింసించారని, స్థానిక శాసనసభ్యురాలికి వ్యతిరేకంగా వాట్సాప్ లో పోస్ట్  చేయడమే ఆయన చేసిన నేరమా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని డీజీపికి ఆయన విజ్ఞప్తి చేశారు.