
- 50 ఏండ్లయినా పేదరికాన్ని ఎందుకు నిర్మూలించలే?: మోడీ
- తొమ్మిదేండ్ల పాలన పూర్తయిన సందర్భంగా రాజస్థాన్‌లో ర్యాలీ
జైపూర్: పేదోళ్లను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ విధానం అని ప్రధాని నరేంద్ర మోడీ ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులూ పేదలను తప్పుదారిపట్టిస్తూ అణిచివేతకు పాల్పడిందని విమర్శించారు. ‘‘పేదరికాన్ని నిర్మూలిస్తామని 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇన్నేళ్ల తర్వాత కూడా పేదరికాన్ని ఎందుకు రూపుమాపలేదు? అబద్ధాలు చెప్పి మోసం చేయడమే కాంగ్రెస్ పని. రాజస్థాన్ ప్రజలు కూడా కాంగ్రెస్ విధానాలతో నష్టపోయారు” అని మోడీ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బుధవారం జైపూర్ లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు.
తమ తొమ్మిదేళ్ల హయాంలో దేశ ప్రజలకు మంచి పాలన అందించామని, పేదల సంక్షేమానికి కృషి చేశామని చెప్పారు. 2014కు ముందు అవినీతిని వ్యతిరేకిస్తూ ప్రజలు రోజూ రోడ్లపైకి వచ్చేవారని, కాంగ్రెస్ పార్టీ పాలనలో టెర్రర్ దాడులతో ప్రధాన నగరాలు దద్దరిల్లేవని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రభుత్వాన్ని నడిపిందని మండిపడ్డారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్, కైలాష్ చౌదరి, రాజస్థాన్‌కు చెందిన బీజేపీ నేతలు పాల్గొన్నారు.
బ్రహ్మదేవుడి ఆలయంలో మోడీ పూజలు
అంతకుముందు అజ్మీర్ జిల్లా పుష్కర్‌లో బ్రహ్మదేవుడి ఆలయాన్ని మోడీ సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బహిరంగ ర్యాలీ కోసం హెలికాప్టర్‌లో జైపూర్‌కు బయలుదేరారు.