కల్వకుర్తి/ఆమనగల్లు, వెలుగు : తెలంగాణలోని ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు, ఉద్యోగులకు పూర్తి ఆదరణ లభిస్తోందని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం కల్వకుర్తి, ఆమనగల్లు ప్రాంతాల్లో వారు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో చేయలేని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తోందని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు 11 శాతం పీఆర్సీ అమలు చేశామని, నిరుద్యోగుల కోసం కేవలం రెండున్నర ఏండ్లలోనే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు.
గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని, కానీ తమ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తోందని వివరించారు. రైతుల సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రతి గింజను కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. శంకర్ కొండ తండాలో ఇందిరమ్మ ఇండ్లను, ఆమనగల్లులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వివిధ విభాగాల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

