ప్రగతి పథమే ప్రజాప్రభుత్వ లక్ష్యం.. గత ప్రభుత్వం అప్పులతో అధోగతి పాలు చేసింది

 ప్రగతి పథమే ప్రజాప్రభుత్వ లక్ష్యం.. గత ప్రభుత్వం అప్పులతో అధోగతి పాలు చేసింది

ప్రజా ప్రభుత్వం  రెండేళ్లలోనే  ప్రగతిపథాన్ని సాధించింది.  ఎన్నికల్లో ఇచ్చిన  హామీలను  తక్కువ  సమయంలో  అమలుచేసిన  ప్రభుత్వంగా మేం  నిలిచామని  గర్వంగా  ప్రకటిస్తున్నాం.  గత ప్రభుత్వం పదేళ్లు అప్పులుచేసి అధోగతిపాలు చేయగా.. మా ప్రభుత్వం ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ముందుకు కొనసాగుతోంది.

అన్నదాతలను ఆదుకునేందుకు  రుణమాఫీ పథకాన్ని అమలు చేశాం.  రూ.2 లక్షలలోపు  బ్యాంకుల్లో అప్పు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేయడం జరిగింది. వరి వేస్తే ఉరే అని అన్నదాతలను గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం బెదిరించింది. కానీ, నేడు వరి పండించే  రైతులకు అండగా నలిచి  భరోసా ఇస్తోంది కాంగ్రెస్​ ప్రభుత్వం. 

రైతులను ఆదుకునేందుకు సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇచ్చి, వరి పండించే వారికి అండగా  నిలుస్తున్నాం. 2024-–2025 ఖరీఫ్​ సీజన్‌లో 128.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 22.01 లక్షల మంది రైతుల నుంచి సేకరించి రూ.29,710 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రైతుబీమా, రైతు భరోసా పథకాలను అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో  భూవ్యవస్థను సర్వ నాశనం చేసిన  ఘనత  బీఆర్ఎస్‌ది. అటువంటి ధరణి వ్యవస్థను బంగాళాఖాతంలో పడవేసి భూభారతి తీసుకువచ్చి  భూ బాధలను తీర్చాం.  

ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేశాం. 2024 ఫిబ్రవరి 27 నుంచి  రూ.500లకే సిలిండర్ పథకాన్ని అమలు చేసి ఆడబిడ్డల వంటింటి కష్టాల్లో భాగమై భరోసాగా  కాంగ్రెస్  ప్రభుత్వం నిలిచింది.

పేదల సంక్షేమానికి ప్రతిరూపం కాంగ్రెస్ పార్టీ. ప్రతి పేదవాడు  కడుపునిండా అన్నం తినాలనే సంకల్పంతో సన్న బియ్యం పథకాన్ని అమలు చేశాం.  1.03 కోట్ల రేషన్ కార్డుదారులకు నెలకు 2.10 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం. 

ఇందిరమ్మ ఇళ్లు

 కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో నిరుపేదలకు పక్కా ఇళ్లను నిర్మిస్తోంది. ప్రతి నియోజకవర్గానికి 4,500 ఇళ్లను కేటాయించి, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తోంది.  ఇప్పటికే  రాష్ట్ర వ్యాప్తంగా  ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది.   కొత్తగా 13,62,908కి  రేషన్ కార్డులు  ఇచ్చినందుకు  కాంగ్రెస్ పార్టీని  ఆదరించాలని  ప్రజలను కోరుతున్నాం.

 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ప్రణాళికతో  మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు,  ఆర్టీసీకి  హైర్ బస్సులు,  సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాట్లను ప్రోత్సహించడం జరిగింది. విద్యాభివృద్ధి కోసం .. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్ స్కూల్స్​ ఏర్పాటు చేస్తున్నాం.  చేనేతకు  చేయూత పేరుతో చేనేత రంగానికి రూ.1000 కోట్లు కేటాయించడమేగాక  చేనేత అభయహస్తం పథకాన్ని అమలు చేస్తున్నాం.  

 పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ 

టీజీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేసి  ప్రజాప్రభుత్వ నిబద్ధతను చాటుకుంటున్నాం.  గ్రూప్‌-–1 ఉద్యోగాలు 568 మంది, 783 మంది గ్రూప్‌-–2,   గ్రూప్‌-–3  ఉద్యోగాలు 1365 మందికి, 8084 మందికి గ్రూప్‌-–4 ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపామని స్పష్టం చేస్తున్నాం.  ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహించడంతోపాటు మెగా డీఎస్సీ ద్వారా 11,062 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయడమేగాక 5 వేల మంది గ్రామాధికారులు, దాదాపు 70 వేలకుపైగా వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేసినందుకు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విశ్వసించాలి.  

గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 5136 మంది ఉపాధ్యాయులను శాశ్వత ప్రాతిపదికన నియమించడంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,284 ల్యాబ్‌ టెక్నీషియన్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.  ప్రభుత్వ ఆస్పత్రుల్లో  9వేలకుపైగా  పోస్టుల  భర్తీ పూర్తి,   మరో  7వేలకుపైగా ఉద్యోగ 
నియామకాలు  కొనసాగుతున్నాయి. 

నీలి విప్లవం దిశగా...

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు 3,642 విద్యార్థులకు రూ.463 కోట్ల రూపాయల ఓవర్సీస్ స్కాలర్​షిప్‌ ఇచ్చాం. ఉచిత చేప పిల్లల పథకం కోసం రూ.122.22కోట్లు కేటాయింపుతో 5 లక్షల మంది మత్స్యకారులకు ఉపాధి కల్పించడం జరుగుతోంది. రాష్ట్రంలో ఉన్న 101 జలాశయాల్లో,  2,307  చెరువుల్లో,   23,950 సీజనల్  చెరువుల్లో 6 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంతో రూ.94 కోట్ల రూపాయలతో 84 కోట్ల  చేప పిల్లలు, 300 నీటి వనరుల్లో 28.22 కోట్ల రూపాయలతో 10 కోట్ల రొయ్య పిల్లల పంపిణీతో  నీలి విప్లవం దిశగా మా ప్రభుత్వం అడుగులు  వేస్తోంది. 

సమాజంలో దశాబ్ధాలుగా వివక్షకు గురై సమాన అవకాశాలకు 35 సంవత్సరాలు పోరాడుతున్న ఎస్సీ వర్గీకరణకు  పరిష్కారం చూపింది ప్రజాప్రభుత్వం.  బీసీల రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కులగణన చేపట్టి రాష్ట్రంలో  కులాలవారీగా లెక్కలు తేల్చిన ఘనత  మా ప్రభుత్వానిది. 42 శాతం బీసీ  రిజర్వేషన్లను  అడ్డుపడి అడ్డుకున్న చరిత్ర  బీఆర్ఎస్‌, బీజేపీలది. 

దేశానికి దిక్సూచిగా తెలంగాణ

ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయ ఢంకా మోగించింది. తెలంగాణను  సస్యశ్యామలం చేసే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం  అడుగులు వేస్తోంది.  సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను దేశానికి  దిక్సూచిగా  నిలిపేలా   ముందుకు సాగుతున్నాం.  నీళ్లు లేక  నెర్రలుబారి న  పాలమూరు  భూములను  పాలమూరు-–రంగారెడ్డి ఎత్తిపోతల  ప్రాజెక్టు ద్వారా  పచ్చగా  మార్చేందుకు  ప్రజాప్రభుత్వం  కృషి  చేస్తోంది.  

ఎన్నికల హామీలను అమలుచేస్తూ  ప్రజల కోసం ముందుకు సాగుతున్న కాంగ్రెస్‌   ప్రభుత్వాన్ని,   కాంగ్రెస్‌  పార్టీని   మున్సిపల్ ఎన్నికల్లో   గెలిపించాలని   ప్రజలకు   పిలుపునిస్తున్నాం.    లోక్​సభ  ఎన్నికలు,  కంటోన్మెంట్,  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక,  సర్పంచ్‌  ఎన్నికల్లో  అండగా  నిలిచినట్లే  మున్సిపల్  ఎన్నికల్లో కూడా ప్రజలు   కాంగ్రెస్  పార్టీకి  అండగా   నిలవాలని కోరుతున్నాం.  గత పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని  అప్పులపాలు చేసిన బీఆర్ఎస్‌ను, 12 ఏళ్లుగా  అధికారంలో  కొనసాగుతున్న బీజేపీని  ప్రజలు ఆదరిస్తే   ప్రమాదకరమని  గ్రహించాలి.   ప్రజలు  ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలి.

 

వాకిటి శ్రీహరి ముదిరాజ్,
రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, యువజన సర్వీసులు, 
క్రీడలశాఖ మంత్రి