- మహిళలకు కాంగ్రెస్ ధోకా చేస్తోంది
- తేజస్వి సూర్య మాటలకు బాధపడుంటే క్షమించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను దోచుకుంటున్నారని కేంద్ర మంత్రి శోభ కరంద్లజే ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని, సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి మీడియాతో ఆమె మాట్లాడారు.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు హేయంగా ఉందన్నారు. మహిళా బిల్లు వీగిపోవడంపై కాంగ్రెస్ నాయకులు సంబురాలు చేసుకోవడం ఆ పార్టీ మహిళా వ్యతిరేక ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు.
దక్షిణాదికి అన్యాయం చేసింది కాంగ్రెస్సే..
మహిళా బిల్లు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని శోభ కరంద్లజే ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలలోని మహిళా నేతలు కూడా తమకు రాజకీయంగా అవకాశాలు వస్తాయని బిల్లును స్వాగతించినా, వారి అగ్ర నాయకత్వం మాత్రం రాజకీయ స్వార్థంతో అడ్డుకుందని విమర్శించారు.
హామీలు ఏమయ్యాయి?
కాంగ్రెస్ మహిళలను ధోకా చేస్తోందని, నెలకు రూ.2,500 ఎందుకివ్వడం లేదో సీఎం చెప్పాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. విద్యార్థినులకు స్కూటీలు, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఏమయ్యాయని ప్రశ్నించారు. కర్నాటకలోనూ కాంగ్రెస్ ఇలాగే మోసం చేసిందని మండిపడ్డారు. ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజల మనోభవాలు దెబ్బతిని ఉంటే క్షమాపణలు కోరుతున్నట్టు చెప్పారు.

