- పేపర్ల లీకేజీపై త్వరలో హైదరాబాద్‌లో భారీ దీక్ష
- కాంగ్రెస్ ‘విద్యార్థి ఉద్యమ కమిటీ’ రౌండ్ టేబుల్ మీటింగ్‌లో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై త్వరలో హైదరాబాద్‌లో భారీ నిరసన దీక్ష చేపట్టాలని కాంగ్రెస్ ‘విద్యార్థి ఉద్యమ కమిటీ’ రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు, నిరుద్యోగులు నిర్ణయించారు. ఇందుకోసం ‘ప్రశ్నపత్రాల వ్యాపార పోరాట కమిటీ’ని ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. ఆదివారం నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీలో కాంగ్రెస్ పార్టీ ‘విద్యార్థి ఉద్యమ కమిటీ’ నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీటింగ్‌కు పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్లువిశ్వేశ్వర్రావు, గాలి వినోద్ కుమార్, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీని రద్దు చేయాలంటూ వక్తలు డిమాండ్ చేశారు.
పేపర్లు అమ్ముకున్నరు: కోదండరాం
టీఎస్పీఎస్సీని రద్దు చేసి కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేసిన తర్వాతే నియామకాల ప్రక్రియను చేపట్టాలని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాలను అమ్ముకుంటూ వ్యాపారంగా మార్చారని, దీనిపై పోరాటానికి ‘ప్రశ్నపత్రాల వ్యాపారాల పోరాట కమిటీ’ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అందులో అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, విద్యార్థి నేతలుంటారని చెప్పారు. లేకలేక నోటిఫికేషన్లను వేసి క్వశ్చన్ పేపర్లను అమ్ముకున్నారని ఆయన ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు త్వరలోనే హైదరాబాద్‌లో భారీ దీక్ష, ధర్నా చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేద్దామని, గ్రామగ్రామానికి వెళ్లి పరిస్థితిని వివరించాలని అన్నారు. అరెస్ట్ అయిన విద్యార్థులకు అండగా నిలుద్దామని ఆయన చెప్పారు.
రాష్ట్ర సర్కారు స్పందించాలి: మల్లు రవి
పేపర్ల లీకేజీపై రాష్ట్ర సర్కారు వెంటనే స్పందించాలని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి డిమాండ్ చేశారు. కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కమిషన్ చైర్మన్, సభ్యులను తొలగించేలా గవర్నర్‌కు తీర్మానం పంపాలన్నారు. కాంగ్రెస్ తరఫున తాము కూడా సంతకాలను సేకరించి రాష్ట్రపతికి వినతిపత్రం పంపుతామని ఆయన చెప్పారు. నిరుద్యోగుల తరఫున కోదండరాంను ముందుపెట్టి పోరాడుదామని, రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలను కలుపుకొని జేఏసీని ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ప్రశ్నించే గొంతుల్లేక బలహీనవర్గాలు తమ హక్కుల కోసం పోరాడలేకపోతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. 30 లక్షల మంది జీవితాలను బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డున పడేసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లీ, బఠానీల్లాగా టీఎస్పీఎస్సీ పేపర్లను అమ్ముకున్నారని ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ ఆరోపించారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనారెడ్డి అన్నారు.
నిరుద్యోగులంతా పల్లెలకు వెళ్లండి : గద్దర్
నిరుద్యోగులంతా పల్లెలకు వెళ్లి పేపర్ల లీక్ కేసులో పరిస్థితులను ప్రజలకు వివరించాలని ప్రజా గాయకుడు గద్దర్ పిలుపునిచ్చారు. చదువుకున్న స్కూళ్లు, కాలేజీలు, రచ్చబండ వద్ద అన్ని విషయాలను వివరించాలని ఆయన అన్నారు. పార్టీలేవైనా అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. జైలుకెళ్లిన కేయూ స్టూడెంట్లకు అండగా నిలవాలని, వాళ్ల ఇంటికి వెళ్లి భరోసా ఇవ్వాలని సూచించారు. పేపర్ల లీకేజీ పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన అన్నారు.
డొక్కలు ఎండబెట్టుకుని చదివినం: నిరుద్యోగి చందు
రాష్ట్రమొస్తే ఉద్యోగాలొస్తాయని ఆశపడ్డామని, కానీ, ఇప్పుడు నిరాశే ఎదురైందని సిద్దిపేటకు చెందిన చందు అనే నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో విద్యార్థులే ప్రాణ త్యాగాలు చేశారని తెలిపారు. పేపర్ లీకు కేసులో నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్ వెనుక పెద్ద తలలున్నాయని, కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. 2014లోనే పేపర్ లీకేజీకి పునాది పడిందని ఆరోపించారు. రాష్ట్రం వచ్చాక ఫస్ట్ టైం గ్రూప్1 నోటిఫికేషన్ వచ్చిందని, డొక్కలు ఎండబెట్టుకుని పరీక్షలకు సిద్ధమయ్యామని ఆయన చెప్పారు. 15 పేపర్లు బయటకు ఎట్లా పోతాయని ప్రశ్నించారు.
బలైంది బలహీన వర్గాల పిల్లలే
పేపర్ల లీకేజీతో బలహీనవర్గాల పిల్లలే బలయ్యారని ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. యూపీఎస్సీ తరహాలోనే టీఎస్పీఎస్సీ పరీక్షలను నిర్వహించాలని ఆయన అన్నారు. ఇది పేపర్ లీక్ కాదని, క్వశ్చన్ పేపర్లను అమ్ముకున్నారని ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు మండిపడ్డారు. కేసును సీబీఐ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ప్రొఫెసర్ రియాజ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే పోరాటం చేశామో.. ఇప్పుడు పేపర్ లీక్ వ్యవహారంపైనా అట్లనే ఉద్యమించాల్సిన అవసరం ఉందని న్యూ డెమొక్రసీ నేత గోవర్ధన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ మాత్రం బయటకు రావడం లేదని పీవోడబ్ల్యూ సంధ్య మండిపడ్డారు. సీఎం బిడ్డకు కష్టమొస్తే రాష్ట్రానికే కష్టమొచ్చినట్టు చేశారని, మంత్రులనూ ఢిల్లీకి పంపారని, నిరుద్యోగుల మీద మాత్రం చిన్న చూపు చూస్తున్నారని ఇందిరా శోభన్ అన్నారు.

