కాంగ్రెస్ నాలుగో లిస్ట్  .. ఐదుగురు అభ్యర్థులతో రిలీజ్ చేసిన కేసీ వేణుగోపాల్​

కాంగ్రెస్ నాలుగో లిస్ట్  .. ఐదుగురు అభ్యర్థులతో రిలీజ్ చేసిన కేసీ వేణుగోపాల్​
  • సూర్యాపేటలో దామోదర్ రెడ్డి, తుంగతుర్తిలో 
  • మందుల శామ్యూల్, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి పోటీ
  • పటాన్​చెరులో నీలం మధు ప్లేస్​లో కాట శ్రీనివాస్ గౌడ్
  • ఏడుగురితో బీజేపీ ఐదో లిస్టు

హైదరాబాద్, వెలుగు :  ఐదుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ నాలుగో లిస్ట్ విడుదల చేసింది. పెండింగ్ లో ఉంచిన సూర్యాపేట టికెట్ ను మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి, తుంగుతుర్తి టికెట్ ను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మందుల శామ్యూల్​కు, మిర్యాల గూడ టికెట్ ను బత్తుల లక్ష్మారెడ్డికి, చార్మినార్ టికెట్ ను మహ్మద్ ముజీబ్ ఉల్లా షరీఫ్ కు కేటాయించారు. ఎంఐఎం సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వస్తారని భావించి చార్మినార్ టికెట్ ను ఇంత కాలం పెండింగ్ లో ఉంచగా, ఆయన రాకపోవటంతో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది.

మస్కతి డైరీ చైర్మన్ పేరు పరిశీలనకు రాగా ఆయనకు కూడా టికెట్ దక్కలేదు. పఠాన్ చెరు అభ్యర్థిని పార్టీ హైకమాండ్ మార్చింది. గతంలో పఠాన్ చెరు టికెట్ నీలం మధు ముదిరాజ్ కు కేటాయించగా తాజాగా నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కు కేటాయించారు.సూర్యాపేట టికెట్ ను ఆశించిన రేవంత్ రెడ్డి అనుచరుడు పటేల్ రమేశ్ రెడ్డి, తుంగతుర్తి టికెట్ ను ఆశించిన అద్దంకి దయాకర్ కు నిరాశే ఎదురైంది.

చివరి నిమిషం వరకు జాబితాలో తుంగతుర్తి సీటుకు అద్దంకి పేరు ఉండగా ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నేతల ఒత్తిడి మేరకు మందుల శామ్యూల్​కు టికెట్ కేటాయించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అద్దంకి కి టికెట్ రాకుండా పార్టీ జిల్లా సీనియర్లే అడ్డుపడ్డారని ప్రచారం జరగుతున్నది. తుంగతుర్తిలో అద్దంకి దయాకర్, సూర్యాపేటలో పటేల్ రమేశ్ రెడ్డి కోసం చివరి వరకు రేవంత్ పట్టుబట్టినట్లు తెలుస్తున్నది. పఠాన్ చెరు అభ్యర్థిని మార్చాల్సిందే అని మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు దామోదర నర్సింహ పట్టుబట్టారు. శ్రీనివాస్ గౌడ్ భార్య సైతం గాంధీభవన్ కు వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో హైకమాండ్ దిగొచ్చి కాటా శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ కేటాయించింది.

2018 లో పఠాన్ చెరు నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 78 వేల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. కాగా సూర్యాపేటలో గురువారం మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్​రెడ్డిలు, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, పఠాన్ చెరు అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్లకు చివరి తేదీ కావటంతో పఠాన్ చెరు కొత్త అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ తో పాటు చార్మినార్ అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేయనున్నారు.