డీసీసీ అధ్యక్షుల పనితీరుపై కలర్ కోడ్..ప్రతి 3 నెలలకోసారి కాంగ్రెస్ హైకమాండ్ మార్కులు

డీసీసీ అధ్యక్షుల పనితీరుపై కలర్ కోడ్..ప్రతి 3 నెలలకోసారి కాంగ్రెస్ హైకమాండ్ మార్కులు
  • జూన్‌‌‌‌‌‌‌‌లో మొదటి రిపోర్ట్.. పనితీరు మార్చుకునేందుకు 3 నెలలు చాన్స్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే తొలిసారిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను నేరుగా ఢిల్లీ నాయకత్వమే నియమించడంతో పాటు వారి పనితీరును కూడా ఏఐసీసీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షిస్తోంది. ప్రతి 3 నెలలకోసారి వారి పనితీరును సమీక్షించి ‘కలర్ కోడ్’ విధానంలో గుడ్, యావరేజ్, బ్యాడ్‌‌‌‌‌‌‌‌గా గ్రేడింగ్ ఇవ్వనున్నది. ఈ గ్రేడింగ్‌‌‌‌‌‌‌‌లో ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి గ్రీన్‌‌‌‌‌‌‌‌, పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన వారికి డార్క్‌‌‌‌‌‌‌‌ ఎల్లో, సరిగ్గా పని చేయని వారికి  రెడ్‌‌‌‌‌‌‌‌ కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేటాయించనున్నారు.

నిరుడు నవంబర్‌‌‌‌‌‌‌‌లో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించగా, తెలంగాణలో 33 జిల్లాలకు బాధ్యతలు అప్పగించారు. పదవి చేపట్టాక మొదటి 3 నెలలను అబ్జర్వేషన్ పీరియడ్‌‌‌‌‌‌‌‌గా పరిగణించిన హైకమాండ్..  ప్రస్తుతం మార్చి నుంచి మే వరకు వారి పనితీరును సమీక్షిస్తోంది. ఈ రివ్యూ ఆధారంగా జూన్ మొదటి వారంలో ఢిల్లీ నుంచి మొదటి ‘కలర్ కోడ్’ విడుదల కానున్నది.

ఈ కాలంలో ఏఐసీసీ, పీసీసీ ఇచ్చిన కార్యక్రమాలను జిల్లాల్లో ఎంతవరకు విజయవంతంగా నిర్వహించారు? స్థానిక సమస్యలపై డీసీసీ అధ్యక్షులుగా స్వయంగా ఎన్ని కార్యక్రమాలు చేపట్టారు? అనే అంశాలను ఢిల్లీ నేతలు పరిశీలిస్తున్నారు. పనితీరు సంతృప్తికరంగా లేకపోతే మొదటిసారి రెడ్ కలర్ కోడ్ ఇచ్చి మరో 3 నెలల గడువు ఇస్తారు. అప్పటికీ మార్పు లేకపోతే ఆ అధ్యక్షులను పదవి నుంచి తొలగించే అవకాశముంది. 

యాప్‌‌‌‌‌‌‌‌లో పనితీరు అప్‌‌‌‌‌‌‌‌లోడ్..

ఏఐసీసీ చేపట్టిన ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం చేపట్టే కార్యక్రమాల వివరాలను డీసీసీ అధ్యక్షులు ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా రోజువారీగా అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, వివరాలు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో పంపించాల్సి ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగానే గ్రేడింగ్ కింద ‘కలర్ కోడ్’ నిర్ణయించనున్నారు.  ఇదిలా ఉండగా..  ఈ ఏడాది ఫిబ్రవరిలో వికార్‌‌‌‌‌‌‌‌బాద్ జిల్లా అనంతగిరిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు 10 రోజులపాటు ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు.

దీన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముగింపు రోజున హాజరై డీసీసీ అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా డీసీసీ అధ్యక్షుల పాత్ర, ప్రాధాన్యతపై రాహుల్ గాంధీ వివరించారు. గతంలో డీసీసీ అధ్యక్షులను పీసీసీ నియమించేది.. వారికి ఏఐసీసీతో సంబంధం ఉండేది కాదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఢిల్లీ నాయకత్వం నేరుగా పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌లతోపాటు డీసీసీ అధ్యక్షులతో కూడా మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలపై సమీక్షిస్తోంది. దీంతో డీసీసీ అధ్యక్షుల పదవికి ప్రాధాన్యత పెరిగింది. అదే సమయంలో వారి పనితీరును కూడా కేంద్ర నాయకత్వం నిశితంగా పర్యవేక్షిస్తూ, పదవిలో కొనసాగించాలా లేదా అనే నిర్ణయం తీసుకోనున్నది.