ఉమ్మడి వరంగల్‌‌‌‌, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్‌‌‌‌ నిరసనలు..

ఉమ్మడి వరంగల్‌‌‌‌, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్‌‌‌‌ నిరసనలు..

వెలుగు, నెట్​వర్క్​: ఉత్తరాఖండ్‌‌‌‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న సభా వేదికను శుద్ధి చేయడాన్ని నిరసిస్తూ ఉమ్మడి వరంగల్‌‌‌‌, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్‌‌‌‌ పార్టీ శుక్రవారం పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించింది. ములుగు, మహబూబాబాద్‌‌‌‌, వరంగల్‌‌‌‌, హనుమకొండ, కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాల్లో ర్యాలీలు, సత్యాగ్రహాలు చేపట్టి బీజేపీ వైఖరిని ఖండించారు. ఖర్గేకు బీజేపీ నాయకత్వం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌‌‌‌ నేతలు డిమాండ్‌‌‌‌ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి ధనసరి సీతక్క నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఖర్గేను అవమానించడం అణగారిన, వెనుకబడిన వర్గాల ప్రజలను అవమానించడమేనన్నారు. కుల, మతాల పేరుతో విభేదాలు సృష్టించే రాజకీయాలకు స్వస్తి పలకాలని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌‌‌‌ షా ఘటనపై స్పందించి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌‌‌‌ చేశారు. మహబూబాబాద్‌‌‌‌ అంబేద్కర్‌‌‌‌ విగ్రహం వద్ద డీసీసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహం నిర్వహించారు. 

ఎమ్మెల్యే డా. భూక్యా మురళి నాయక్‌‌‌‌, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్‌‌‌‌ పాల్గొని బీజేపీ వైఖరిని ఖండించారు. వరంగల్‌‌‌‌లో డీసీసీ అధ్యక్షుడు మహ్మద్‌‌‌‌ ఆయూబ్‌‌‌‌ ఆధ్వర్యంలో వెంకట్రామా జంక్షన్‌‌‌‌ నుంచి కాశీబుగ్గ అంబేద్కర్‌‌‌‌ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కేఆర్‌‌‌‌.నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పాల్గొన్నారు. హనుమకొండలో డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్‌‌‌‌ జంక్షన్‌‌‌‌ వద్ద సత్యాగ్రహం చేపట్టారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్‌‌‌‌.నాగరాజు పాల్గొన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌‌‌‌ నేతలు, కార్యకర్తలు నోటికి నల్ల వస్త్రాలు కట్టుకుని సత్యాగ్రహం నిర్వహించారు. ఖమ్మంలో జిల్లా కాంగ్రెస్‌‌‌‌ కార్యాలయం నుంచి అంబేద్కర్‌‌‌‌ విగ్రహం వరకు జిల్లా కాంగ్రెస్‌‌‌‌ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్‌‌‌‌, అర్బన్‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌‌‌‌ చౌదరి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు.