ప్రస్తుత డీసీసీ చీఫ్లకు మళ్లీ నో చాన్స్ : మీనాక్షి నటరాజన్

ప్రస్తుత డీసీసీ చీఫ్లకు మళ్లీ నో చాన్స్ : మీనాక్షి నటరాజన్
  • జూమ్ మీటింగ్​లో కాంగ్రెస్ ఇన్​చార్జ్ మీనాక్షి దిశానిర్దేశం
  • పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల దగ్గరి బంధువులకు ఇవ్వొద్దు
  • గత ఐదేండ్ల నుంచి పార్టీకి పనిచేస్తున్న వారే అర్హులు
  • ఏఐసీసీ అబ్జర్వర్లను ఇండ్లకు ఆహ్వానించవద్దని, వ్యక్తిగతంగా మాట్లాడొద్దని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులుగా కొనసాగుతున్న వారిని మళ్లీ డీసీసీ చీఫ్ గా నియమించేది లేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. మంగళవారం ఆమె తెలంగాణలోని అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులతో మాట్లాడారు. రాష్ట్రంలో డీసీసీ నియామకాల కోసం అన్ని జిల్లాల్లో ఏఐసీసీ అబ్జర్వర్లు పర్యటిస్తున్న నేపథ్యంలో వారితో ఆయా జిల్లాల నేతలు ఎలా వ్యవహరించాలనే దానిపై మీనాక్షి నటరాజన్ పలు కీలక సూచనలు చేశారు.

 పార్టీకి సంబంధించిన నేతల, ప్రజా ప్రతినిధుల దగ్గరి బంధువులకు కూడా డీసీసీ చీఫ్ పదవులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ పదవి పొందేందుకు పార్టీ కోసం గత ఐదేండ్లుగా క్రమశిక్షణతో పనిచేస్తున్న వారు మాత్రమే అర్హులని ఆమె వారికి వివరించారు. అలా లేని వారి దరఖాస్తులను పరిశీలకులే తొలగిస్తారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు ఈ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు.

 డీసీసీ చీఫ్ నియామకాల కోసం జిల్లాలకు వచ్చే ఏఐసీసీ అబ్జర్వర్లతో ఏ నాయకులు కూడా వ్యక్తిగతంగా మాట్లాడవద్దని, వారితో ప్రైవేట్​గా సమావేశాలు ఏర్పాటు చేయొద్దని కోరారు. పార్టీ సమావేశాలు అక్కడి నాయకుల ఇండ్లు, వారి సొంత ఆఫీసుల్లో నిర్వహించకూడదని ఆమె సూచించారు. పార్టీ ఆఫీసుల్లో లేదా అందరికి అందుబాటులో ఉండే ప్రాంతంలో నిర్వహించాలని కోరారు. ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన ‘ఓట్ చోరీ’ వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పార్టీ నేతలంతా సీరియస్​గా తీసుకోవాలని కోరారు. ప్రతి గ్రామం నుంచి కనీసం వంద మందితో సంతకాలు చేయించాలని సూచించారు.