హైదరాబాద్, వెలుగు: బీజేపీతో టచ్‌లో ఉండేందుకే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని విప్ బల్మూరి వెంకట్ ఆరోపించారు. బుధవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతోనే కేటీఆర్ ఇతర కేంద్ర మంత్రులను కలుస్తున్నారని చెప్పారు. బీజేపీ పెద్దల ప్రసన్నం కోసమే అక్కడ మకాం వేశారని, లేకపోతే కేటీఆర్‌కు ఢిల్లీలో ఏం పని ఉంటుందని ప్రశ్నించారు.
లోక్‌సభలో బీఆర్ఎస్‌కు ఒక్క సభ్యుడు కూడా లేడని, రాజ్యసభలో ఇద్దరు మాత్రమే ఉన్నారని, మరి ఆయన ఢిల్లీలో ఉండి చేసేదేముందని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేసే ప్రయత్నంలో ఉన్నాయని జోస్యం చెప్పారు. హైడ్రా విషయంలో కేటీఆర్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని, ఇలాగే మాట్లాడితే కేటీఆర్‌ను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌కు పంపించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
