హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో వరద ముప్పును ముందస్తుగా గుర్తించే ‘స్టేట్ క్లైమేట్ సెంటర్ ఫర్ సిటీస్’ ఆఫీస్‌ను గురువారం హైదరాబాద్ సీడీఎంఏ కార్యాలయంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ప్రారంభించారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం జారీ చేసిన జీవో నంబర్ 472 ప్రకారం ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ఆఫీస్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన నాలెడ్జ్, డేటా హబ్‌గా పనిచేస్తుందని శ్రీదేవి తెలిపారు. గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాల పర్యవేక్షణ, నగరాల్లో ఉష్ణోగ్రత తీవ్రత, పట్టణ వరదల ముప్పును ముందస్తుగా అంచనా వేసి ఇది ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా రూపొందించిన ‘అర్బన్ క్లైమేట్ అట్లాస్’ అనేది ఒక డిజిటల్ మ్యాప్ ఆధారిత ప్లాట్‌ఫారమ్ అని ఆమె పేర్కొన్నారు.
ఇది వాతావరణ ముప్పులు, పట్టణ సేవలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ అధికారులు సమస్యలను సులభంగా గుర్తించేందుకు సహాయపడుతుందని వివరించారు. ప్రమాదకర ప్రాంతాలను మ్యాప్ ద్వారా గుర్తించి, అక్కడ తక్షణ మౌలిక వసతుల కల్పన చర్యలు చేపట్టడానికి అధికారులకు ఇది ఎంతో ఉపకరిస్తుందని శ్రీదేవి వెల్లడించారు.
