బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు మార్చిన్రు?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు మార్చిన్రు?

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలని పీసీసీ సీనియర్ వైస్​ ప్రెసిడెంట్ ​జి.నిరంజన్ అన్నారు. కేసీఆర్​తో లాలూచీ పడేందుకే సంజయ్​ను తప్పించి కిషన్​రెడ్డిని నియమించారా? అని బీజేపీ  హైకమాండ్​ను ప్రశ్నించారు. డబ్బు వసూళ్లు కూడా సంజయ్​ను తప్పించేందుకు కారణమైందా అని నిలదీశారు. బుధవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడి మార్పు బీజేపీ అంతర్గత వ్యవహారమే అయినా..  దాని గురించి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 

పుస్తెలమ్మి నామినేషన్​ వేసిన సంజయ్​.. పత్రికల్లో రూ.వందల కోట్లతో యాడ్​లు ఇచ్చేవరకు ఎలా ఎదిగారంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​ రావు ప్రశ్నించడం అనుమానాలకు తావిస్తున్నదని చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరిట సంజయ్​ రూ.500 కోట్లు వసూలు చేశారనే వార్తలు వస్తున్నాయన్నారు.