
- చట్టాల్లో మార్పులు చేయాలి
- ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి
- వీలైనంత త్వరగా రిపోర్ట్: రేమండ్ పీటర్
- హైకోర్టు కేసులనూ పరిశీలిస్తం: సునీల్
హైదరాబాద్: ధరణి పోర్టల్ లోపాల కారణంగా బీఆర్ఎస్ హయాంలో చాలా మంది పేద రైతులకు రైతుబంధు సాయం అందలేదని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు, ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి అన్నారు. ఇవాళ సీసీఎల్ ఏ లో ధరణిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పోర్టల్ లో లోపాలు, చేయాల్సిన సవరణలపై కమిటీ చర్చించింది. అనంతరం కోదండరెడ్డి మాట్లాడుతూ.. 2014 వరకు రైతులకు భూముల హక్కుల విషయంలో ఎలాంటి సమస్యలూ రాలేదన్నారు. గత ప్రభుత్వం చేసిన చట్టాల్లో అనేక లోపాలున్నాయని, వాటిని సవరించాల్సి ఉందని చెప్పారు. ధరణిలో ఉన్న లోపాల కారణంగా లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
కమిటీ ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటుందని చెప్పారు. సీనియర్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్ మాట్లాడుతూ.. ధరణితో లింక్ ఉన్న అని శాఖల ఒపీనియన్ తీసుకుంటామని, తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా ఏం చేయాలనే అంశాలను పరిశీలిస్తామని చెప్పారు. మార్పులు, చేర్పులపైనే తమ కమిటీ నివేదిక అందిస్తుందని చెప్పారు. కొంత మంది కలెక్టర్లతో రెండు రోజుల్లో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. కమిటీ సభ్యుడు, న్యాయవాది సునీల్ మాట్లాడుతూ.. ధరణి పై హైకోర్టు లో చాలా కేసులు ఉన్నాయని, వాటిని పరిశీలిస్తామని చెప్పారు. తాత్కాలిక సవరణలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు