నేను పార్టీలో చేరితే షర్మిల పదివేల కోట్లు ఇస్తది

నేను పార్టీలో చేరితే షర్మిల పదివేల కోట్లు ఇస్తది

తాను పార్టీ మారితే షర్మిల పదివేల కోట్లు ఇస్తుందని, కానీ తనకు విలువలే ముఖ్యమని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొండా మురళీ అన్నారు. ‘ఏబీసీడీలు రాని మంత్రి దయాకరరావుకు అవార్డులు వస్తున్నాయని.. అసలు ఆయన నా మనుమరాలు చదివే ఏబీసీడీలైనా చదవగలరా?’ అని కొండా మురళి ఎద్దేవా చేశారు. వరంగల్ మునిసిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి.. అధికార పార్టీని ఎలా ఎదుర్కొవాలి అనేదానిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘షర్మిల పార్టీ నుంచి పిలుపు వచ్చింది.. కానీ ఎట్టి పరిస్థితుల్లో రామని చెప్పాం. నేను పార్టీ మారితే షర్మిల పదివేల కోట్లు ఇస్తది, కానీ నాకు విలువలు ముఖ్యం. జగన్‌ను జైలు నుంచి తీసుకొచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశా. తర్వాత జగన్ కనీసం పలకరించలేదు. మేం పార్టీ మారే అవకాశం లేదు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం. కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెద్దాం. జనంలో తిరిగే నాయకుడు కాంగ్రెస్‌కు అవసరం. నేను కరోనాతో చావు అంచుల వరకు వెళ్లి వచ్చాను. ఆసందర్భంలో చాలా మంది టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్‌తో తట్టుకుంటవా అని అప్పట్లో హరీష్ రావు అన్నారు. చంద్రబాబుతోనే ఫైట్ చేశా.. కేసీఆర్ ఎంత అన్నాను. మునిసిపల్ ఎన్నికల్లో అందరూ నామినేషన్లు వేయండి.. దానితో పాటు విత్ డ్రా ఫామ్ కూడా ఇవ్వండి. పార్టీ చెప్పిన వారికే టికెట్లు ఇస్తాం. టికెట్లు తీసుకుని అమ్ముడు పోవద్దు. మీ వెనక మేమున్నాం. నిజాయితీగా ఉండండి’ అని కొండా మురళీ అన్నారు.