ఏకే గోయల్ ఇంట్లో డబ్బు సీజ్ చేయాలి : మల్లు రవి

ఏకే గోయల్ ఇంట్లో డబ్బు సీజ్ చేయాలి : మల్లు రవి

మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో డబ్బులు ఉంటే సీజ్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి డిమాండ్ చేశారు. ఆ డబ్బుతో ఓట్లు కొనకుండా  ఎలక్షన్ కమిషన్  చూడాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్స్ జరగడం లేదని, బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు మధ్య ఎలక్షన్స్ జరుగుతున్నాయని చెప్పారు.

రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వందల కోట్ల డబ్బు ఏకే గోయల్ ఇంట్లో ఉందని తమకు సమాచారం అందిందని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారని, పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు కూడా సమన్వయం పాటిస్తారని పోలీసు అధికారులకు చెప్పామన్నారు. 

ఐదు మోటార్ సైకిళ్లపై డబ్బులు తరలించారని, ఆ వాహనాలకు ముందు, వెనకాల నెంబర్ ప్లేట్స్ లేవని చెప్పారు మల్లు రవి. వారు సివిల్ డ్రెస్సుల్లో ఉన్నారని తెలిపారు. ఏకే గోయల్ ఇంట్లో దాదాపు రూ.200 కోట్ల నగదు వరకు డబ్బు ఉంటుందని భావిస్తున్నామన్నారు.

అసలేం జరిగింది..?

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 22లో ఎలక్షన్స్ స్క్వాడ్ సోదాలు చేస్తున్నాయి. మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఏకే గోయల్ ఇంట్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. 

ఏకే గోయల్ ఇంట్లో భారీగా డబ్బు డంపు చేశారని సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ టీమ్,  ఎలక్షన్స్ స్క్వాడ్ సోదాలు చేస్తున్నాయి. ఏకే గోయల్ ఇంట్లో భారీగా డబ్బు డంప్ చేశారని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. 

ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి .. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. డబ్బుతో ఓట్లను కొనే ప్రయత్నం చేస్తున్నారని అజారుద్దీన్ ఆరోపించారు. 2010లో పదవీ విరమణ పొందిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారుడుగా పనిచేశారు ఏకే గోయల్.