
న్యూఢిల్లీ: మణిపూర్ లో పరిస్థితులు వారం పది రోజుల్లో అదుపులోకి వస్తాయని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత పి.చిదంబరం స్పందించారు. హిమంత తన పని తాను చేసుకుంటే మంచిదని, మణిపూర్ విషయంలో ఆయన వేలు పెట్టాల్సిన అవసరం లేదని చిదంబరం పేర్కొన్నారు. అలాగే మణిపూర్ సీఎం ఎన్. బీరేస్ సింగ్ తో రాజీనామా చేయించి, రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉండదని ఆయన అభిప్రాపడ్డారు.
కొన్ని నెలల పాటు మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆయన సూచించారు. కాగా, అస్సాం సీఎం హిమంత శనివారం మీడియాతో మాట్లాడుతూ మణిపూర్ లో 7–10 రోజుల్లో శాంతి నెలకొంటుందన్నారు. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆయన చెప్పారు.